
ఏపీలో చదివిన విద్యార్థుల ఫీజుపై దృష్టి
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో భాగంగా ఏపీలో చదువుకున్న తెలంగాణ విద్యార్థులకు ఫీజుల చెల్లింపు విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోనుంది. తెలంగాణ స్థానిక విద్యార్థులై ఉండి ఏపీలో చదువుకున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వర్తింపచేసే అంశంపై ఒకటి, రెండు రోజుల్లోనే నిర్ణయం వెలువడవచ్చునని అధికారవర్గాలు వెల్లడించాయి.
గత నాలుగేళ్ల కాలంలో తెలంగాణ విద్యార్థులు ఏపీలో చదువుకుని ఉంటే వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఏ విధంగా అమలు చేయాలన్నదానిపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. విద్యార్థుల స్థానికత నిబంధన కింద ధ్రువీకరణపత్రాలను సమర్పిస్తేనే ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొన్న నేపథ్యంలో ఈ సమస్య తలెత్తింది. కొందరు విద్యార్థులు తమకు సమీపంలో ఉండడంతో పొరుగున ఉన్న జిల్లాల్లో చదువుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫీజుల చెల్లింపుపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది.
ట్రెజరీలకు చేరని నిధులు: ఇదిలా ఉండగా ఆగస్టు మొదటివారంలో 2014-15 ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కానీ ఫీజుల బకాయిల చెల్లింపు కోసం ఆర్థికశాఖ రూ.400 కోట్లను విడుదల చేసినా అవి ఇంకా ట్రెజరీలకు చేరలేదు. దీంతో ఈ విషయాన్ని వివిధ బీసీసంఘాలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాయి.