అత్యున్నత శిఖరమే లక్ష్యంగా.. | The highest peaks of the target | Sakshi
Sakshi News home page

అత్యున్నత శిఖరమే లక్ష్యంగా..

Published Tue, Dec 15 2015 1:50 AM | Last Updated on Sun, Sep 3 2017 1:59 PM

అత్యున్నత శిఖరమే లక్ష్యంగా..

అత్యున్నత శిఖరమే లక్ష్యంగా..

♦ మౌంట్ రెనోక్ అధిరోహణ ఉత్సాహంతో గురుకుల విద్యార్థులు
♦ తదుపరి లక్ష్యం కాంచనగంగ..ఆ తర్వాత ఎవరెస్ట్
♦ శిక్షణకు ఎంపిక కోసం కొనసాగుతున్న పరిశీలన
 
 సాక్షి, హైదరాబాద్: హిమాలయ పర్వత శ్రేణుల్లోని మౌంట్ రెనోక్‌ను విజయవంతంగా అధిరోహించిన ఉత్సాహంతో గురుకుల విద్యార్థులు ఉరకలు వేస్తున్నారు. ఇక ఎవరెస్ట్‌ను ఎక్కేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. 2014లో పూర్ణ, ఆనంద్‌లు ఎవరెస్ట్‌ను అధిరోహించడాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళుతున్నారు. ఎవరెస్ట్ అధిరోహణకు పూర్వ రంగంగా భావించే మౌంట్ రెనోక్‌ను ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన 31 మంది బాలబాలికలు అధిరోహించి రికార్డును సొంతం చేసుకున్నారు. వీరంతా కడు పేదరికం నుంచి వచ్చిన వారే. వారి తల్లిదండ్రులు నిరక్షరాస్యులు, రోజు కూలీలు, వ్యవసాయ కూలీలే. ఈ విద్యార్థుల్లో 16 మంది (8 మంది అబ్బాయిలు, 8 మంది అమ్మాయిలు) గిరిజనులుకాగా.. అందులో ఆరుగురు ఆదిమ గిరిజన తెగ (ప్రిమిటివ్ ట్రైబల్‌గ్రూప్స్)లకు చెందినవారు. కొలామ్, కోయ తెగలకు చెందిన వారు ఇద్దరు చొప్పున, గోండు, చెంచు తెగలకు చెందినవారు ఒక్కొక్కరు ఉన్నారు.

 ఎవరెస్ట్ దారిలో..
 ఎవరెస్ట్ ఎత్తు 29,100  అడుగులుకాగా... మౌంట్ రెనోక్ ఎత్తు 17 వేల అడుగులు. ఎవరెస్ట్ అధిరోహణ అత్యంత కఠినమైనది, వ్యయ ప్రయాసలతో కూడినది. దానికి కఠినమైన శిక్షణను తీసుకోవాల్సి ఉంటుంది. వివిధ స్థాయిల్లో పరీక్షించి, ఎంత వరకూ తట్టుకోగలుగుతారన్నది పరిశీలించాకే ఎవరెస్ట్‌ను అధిరోహించడానికి అనుమతి ఇస్తారు. ఈ పరీక్షలు, పరిశీలనలో భాగంగా తొలుత మౌంట్ రెనోక్‌ను అధిరోహించాలి. దీనిని విజయవంతంగా ఎక్కి, కఠిన పరిస్థితిని తట్టుకోగల వారిని కాంచన గంగ అధిరోహణకు ఎంపిక చేస్తారు. ప్రతికూల పరిస్థితులను తట్టుకునే మానసిక స్థైర్యం ఏమేరకు ఉందన్నది పరిశీలిస్తారు. దీనికితోడు వాతావరణ పరిస్థితి కూడా కీలకమే. ఈ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే ఎవరెస్ట్ అధిరోహణకు పచ్చజెండా ఊపుతారు.

ఇంతకు ముందు 110 మంది గురుకుల విద్యార్థులను పర్వతారోహణకు ఎంపిక చేశారు. వారిలో 20 మందిని ఎంపిక చేయగా.. మౌంట్ రెనోక్‌ను 18 మంది అధిరోహించారు. వారిలో 11 మంది కాంచనగంగను అధిరోహించగా.. ఎవరెస్ట్‌ను ఎక్కేందుకు పూర్ణ, ఆనంద్ మాత్రమే ఎంపికయ్యారు. తాజాగా మౌంట్ రెనోక్‌ను ఎక్కిన 31 మందిలో ఎందరు తదుపరి శిక్షణకు తట్టుకోగలరన్న ప్రాతిపదికన వివిధ పరీక్షలను నిర్వహిస్తారు. ఈ విద్యార్థుల్లో ప్రతి ఆరుగురికి ఒక మెంటార్ ఉన్నందున వారు ఇచ్చే నివేదిక ఆధారంగా ఎంపిక ఉంటుంది.  
 
 మౌంట్ రెనోక్‌ను ఎక్కిన ఎస్టీ, ఎస్సీ విద్యార్థులు..
 జి.ప్రకాష్(లంబాడ-వరంగల్ పాత తండా), ఆర్.ప్రశాంత్(లంబాడ-మెదక్), ఎస్.రాకేష్ (లంబాడ-రంగారెడ్డి), బి.అనిల్(లంబాడ-వరంగల్), పి.అరవింద్(లంబాడ-ఆదిలాబాద్), ఎన్.కృష్ణ(చెంచు-మహబూబ్‌నగర్), టి.భగవంతరావు(కోలామ్), ఎ.మల్లేష్(గోండు-కరీంనగర్), జి.సింధు(లంబాడ-నల్లగొండ), ఎం.జయబాయి(లంబాడ-నల్లగొండ), టి.సుఖిప్రియ (కోయ-ఖమ్మం), డి.యమున(లంబాడ-కురవి), ఎన్.కవిత(లంబాడ-వరంగల్),ఎం.పూజ (లంబాడ-మహబూబ్‌నగర్),ఎస్.అంజలి(కోలామ్-ఆదిలాబాద్),ఈ.తేజశ్రీ(కోయ-ఖమ్మం ) ఉన్నారు. ఇక ఎస్సీ విద్యార్థుల్లో.. బి.పూర్ణచందర్(వరంగల్), జె.రవళి(కరీంనగర్), బి.రాజేశ్ (నల్లగొండ), ఆర్.బాలరాజ్(రంగారెడ్డి), జి.రాకేష్(మెదక్), కె.సాయిబాబా(నల్లగొండ), కె.నరేష్‌కుమార్ (రంగారెడ్డి), ఒ.వెంకటేశ్ (ఆదిలాబాద్), డి.చందు (నిజామాబాద్) ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement