ఎవరెస్టు వీరులకు గ్రాండ్ వెల్‌కం.. | Grand Welcome Everest heroes .. | Sakshi
Sakshi News home page

ఎవరెస్టు వీరులకు గ్రాండ్ వెల్‌కం..

Published Mon, Jun 9 2014 4:42 AM | Last Updated on Sat, Sep 2 2017 8:30 AM

ఎవరెస్టు వీరులకు గ్రాండ్ వెల్‌కం..

ఎవరెస్టు వీరులకు గ్రాండ్ వెల్‌కం..

  • సాహసవీరులకు నగరం రెడ్‌కార్పెట్
  •  అడుగడుగునా పూల జల్లు  
  •  భారీ విజయోత్సవ ర్యాలీ
  • సాక్షి,సిటీబ్యూరో:  అతి పిన్నవయస్సులో అత్యంత ఎత్తై ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి తెలుగుజాతి ఔన్నత్యాన్ని చాటిన మాలావత్ పూర్ణ, సాధనపల్లి ఆనంద్‌కుమార్‌లకు  నగరం రెడ్‌కార్పెట్ పర్చింది. శంషాబాద్ విమానాశ్రయంలోకి అడుగుపెట్టగానే అభిమానులు పెద్దఎత్తున  స్వాగతం పలికారు. నినాదాలు, పూలు జల్లుతూ సాదరస్వాగతం పలికారు.

    అత్యంత ప్రతికూల వాతావరణాన్ని ఎదిరించి ఎవరెస్టు శిఖరంపై భారతపతాకాన్ని ఎగురువేసిన సాంఘికసంక్షేమ గురుకుల విద్యార్థులైన తెలుగుతేజాలు ఆదివారం మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారికి అభిమానులు, గురుకుల సంస్థ విద్యార్థులు, ఉపాధ్యాయులు బొకేలు అందజేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం వారిని అభిమానులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గుర్రపుబగ్గీలో ర్యాలీగా విమానాశ్రయం నుంచి బయటకు తీసుకొచ్చారు. అక్కడ్నుంచి డప్పుచప్పుళ్లతో భారీర్యాలీగా బయల్దేరారు.
     
    పాతబస్తీలో..: సాహసవీరులు పూర్ణ, ఆనంద్‌కుమార్‌లకు పాతనగరంలో ఘనస్వాగతం లభించింది. జగ్జీవన్‌రామ్, అంబేద్కర్ జయంత్యుత్సవాల కమిటీ చైర్మన్ గడ్డం సత్యనారాయణ ఆధ్వర్యంలో వారికి స్వాగతం పలికారు. ఫలక్‌నుమాలో ఏర్పాటు చేసిన స్వాగత వేదికపై హరిజన, గిరిజన ఆదివాసుల అభివృద్ధి సంఘం నాయకులు జి.మోతీలాల్‌నాయక్, దేవేందర్‌నాయక్, రవినాయక్‌లు వారిని అభినందించారు.

    ప్రపంచ బాడీబిల్డర్ మోతేశ్యాంఅలీఖాన్ సాహసవీరులకు పూలమాలలువేసి సత్కరించారు. బండ్లగూడ, చాంద్రాయణగుట్ట, అలియాబాద్ చౌరస్తా, లాల్‌దర్వాజా చౌరస్తా, చార్మినార్ వద్ద అభిమానులు, వివిధప్రజాసంఘాల నేతలు స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం మోజంజాహిమార్కెట్, గన్‌పార్క్, బాబుజగ్జీవన్‌రామ్ విగ్రహం మీదుగా ట్యాంక్‌బండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొని రాజ్యాంగనిర్మాత విగ్రహం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు.
     
     ఇంకా విజయాలు సాధిస్తాం
     గురుకుల, సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్
     
     భోలక్‌పూర్: గురుకుల పాఠశాలల విద్యార్థుల విజ యాలు ఇది ఆరంభమేనని, ఇంకా సాధించాల్సినవి చాలా ఉన్నాయని గురుకుల, సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి, సీనియర్  ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్ అన్నారు. ఎవరెస్టు విజేతలు పూర్ణ, ఆనంద్‌కుమార్‌లకు ట్యాంక్‌బండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సన్మానం జరిగింది. దీనికి విచ్చేసిన ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ గురుకుల పాఠశాలల విద్యార్థులు ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కడమే కాదని, విద్యలో కూడా అదేస్థాయిలో రాణిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ప్రవీణ్‌కుమార్‌ను స్వారోబృందం యువకులు ఎత్తుకుని ఆనందంతో ఊరేగించారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement