డొంక కదులుతోంది | The Hyderabad center is the 'fee scam' | Sakshi
Sakshi News home page

డొంక కదులుతోంది

Published Fri, Mar 3 2017 11:21 PM | Last Updated on Wed, Sep 5 2018 9:18 PM

డొంక కదులుతోంది - Sakshi

డొంక కదులుతోంది

హైదరాబాద్‌ కేంద్రంగానే ‘ఫీజు స్కామ్‌’
ఫైల్‌ అప్‌లోడ్‌ చేసిన ఐపీ అడ్రస్‌ ఇక్కడిదే
లోతుగా దర్యాప్తు చేస్తున్న సైబర్‌ క్రైమ్‌ కాప్స్‌


సాక్షి, సిటీబ్యూరో: నల్లగొండ జిల్లా పీడీ ఖాతాలో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సొమ్ము రూ.11 కోట్లకు ‘టెండర్‌’ వేసి, ఆన్‌లైన్‌ ద్వారా రూ.73.13 లక్షలు కాజేయజూసిన  కేసుపై హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌) ఆధీనంలోని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి అనధికారికంగా ఆన్‌లైన్‌లో క్‌లైమ్‌ ఫైల్‌ అప్‌లోడ్‌ అయ్యింది హైదరాబాద్‌ నుంచేని గుర్తించారు. ఇంటర్‌నెట్‌ ఐపీ అడ్రస్‌ ఆధారంగా దీనిని నిర్థారించిన అధికారులు ట్రెజరీ డైరెక్టరేట్‌ నుంచే ఇది జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. ప్రాథమికంగా ఈ కేసులో నలుగురిని అనుమానితులుగా భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో ట్రెజరీ డైరెక్టరేట్‌లో సీనియర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న ఓ ఉద్యోగితో పాటు స్కాలర్‌ షిప్స్‌ సెక్షన్‌లో పని చేస్తున్న మరో ఉద్యోగి, నల్లగొండ జిల్లా ట్రెజరీ కార్యాలయానికి చెందిన ఇద్దరు ఉద్యోగుల్ని అనుమానితుల జాబితాలో చేర్చారు. వీరిని అరెస్టు చేసేందుకు తగిన ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు. మరోపక్క సర్వశిక్షా అభియాన్‌ ప్రాజెక్టుకు సంబంధించి మదర్సాల్లోని వాలంటీర్లకు చెల్లించాల్సిన రూ.70 లక్షల సొమ్ము కాజేసిన కేసు దర్యాప్తునూ సీసీఎస్‌ అధికారులు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగి సహా మరికొందరిని అరెస్టు చేశారు. ఈ స్కామ్‌ వెనుక పూర్వాపరాలు తెలుసుకునేందుకు అప్పట్లో డీఈఓగా ఉన్న సోమిరెడ్డి వాంగ్మూలం నమోదు చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం అతడిని పిలిపించగా... పూర్తి వివరాలు చెప్పడానికి ఆయన కొంత సమయం కోరినట్లు తెలిసింది.

భోలక్‌పూర్‌ కేసులో ప్రాసిక్యూషన్‌ కోసం...
మరోపక్క సీసీఎస్‌ అధికారులు ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న, తాజాగా నమోదైన కీలక కేసుల్ని కొలిక్కి తీసుకురావడంపై దృష్టి పెట్టారు. 2009 మేలో జరిగిన భోలక్‌పూర్‌ విషాదం కేసులో ప్యాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి లేఖ రాశారు. 2009 మే 5న భోలక్‌పూర్‌ డివిజన్‌లోని భోలక్‌పూర్, ఇందిరానగర్, సిద్ధిఖ్‌నగర్, గుల్షన్‌ నగర్, బంగ్లాదేశ్‌ బస్తీల్లో కలుషిత జలాల బారినపడి 15 మృతి చెందగా, మరో 255 మంది ఆసుపత్రి పాలయ్యారు. తొలుత ముషీరాబాద్‌ పోలీసుస్టేషన్‌లో అనుమానాస్పద మృతిగా ఈ కేసులు నమోదయ్యాయి. ఆపై సీసీఎస్‌కు బదిలీ కావడంతో మరో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అధికారుల అజాగ్రత్త కారణంగానే ఉదంతం చోటు చేసుకున్నట్లు స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన అధికారులు ఇందులో జలమండలి, జీహెచ్‌ఎంసీ, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ తదితర సంస్థల బాధ్యత ఉందని తేల్చారు.

అసలు ఈ దారుణమైన పరిస్థితులు తలెత్తడానికి కారణాలు, వాటి మూలాలను అన్వేషించేందుకు వివిధ లాబొరేటరీలకు నమూనాలు పంపి విశ్లేషణలు చేయించారు. జలమండలి అధికారుల పాత్రపై పూర్తి ఆధారాలు లభించడంతో 2010 జూలైలో ఐదుగురు జలమండలి అధికారులు అరెస్టు చేసి సొంత పూచీకత్తపై విడిచిపెట్టారు. వీరిపై అభియోగపత్రాలు దాఖలు చేయడానికి ప్రభుత్వ అనుమతి తప్పనిసరి కావడంతో అనుమతి కోరుతూ లేఖ రాశారు.ట

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement