మహానగర జీవన ‘చిత్రం’
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మెట్రో పాలిటన్ మహానగర జీవన చిత్రంలో పలు ఆసక్తికర అంశాలు బయటపడుతున్నాయి. అల్పాదాయ, మధ్యాదాయ, వేతన జీవులకు కొంగుబంగారమైన ఈ నగరం ప్రపంచ విస్తీర్ణంలో 38వ స్థానం దక్కించుకుంది. ఆసియాలో 22వ స్థానంతో అలరారుతోంది. 95.77 లక్షల జనాభాతో భాసిల్లుతోంది. 2041 నాటికి ఆ సంఖ్య 1.90 కోట్లకు చేరనుంది. హైటెక్ నగర సామాజిక, ఆర్థికాభివద్ధితో పాటు విద్య, లింగనిష్పత్తి, కుటుంబ ఆదాయం, రవాణా తదితర అంశాలపై లీ అసోసియేట్స్ సిద్ధం చేసిన తాజా నివేదికలోని అంశాలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. నివేదిక వెల్లడించిన పలు ఆంశాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
అల్పాదాయ వర్గాలే అత్యధికం
మహానగరం (హెచ్‌ఎంఏ) పరిధిలో అల్పాదాయ, మధ్యాదాయం పొందే వేతనజీవు లు, కార్మికులే అత్యధికం. అపార్ట్‌మెంట్లలో నివాసం ఉండేవారు సగటున నెలకు రూ.20,200, అద్దె ఇళ్లలో ఉంటున్న వారు రూ.13,600 ఆర్జిస్తున్నట్లు లెక్కగట్టారు. మురికివాడల్లో నివసించేవారి కుటుంబ ఆదాయం నెలకు రూ.9800 మాత్రమే. హెచ్‌ఎంఏ పరిధిలో వేతన శ్రేణులిలా ఉన్నాయి.
శివార్లలో జన ప్రభంజనం..
జనాభా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అనూహ్యంగా పెరుగుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం నగర జనాభా 95,77,759గా ఉంది. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 67,57,552 మంది ఉండగా.. గ్రేటర్‌కు ఆవల మిగతా జనాభా కేంద్రీకృతమైంది. పాత మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్(ఎంసీహెచ్) పరిధిలో నివసిస్తున్నవారు 39,93,389 మంది మాత్రమే. అంటే గడిచిన దశాబ్ద కాలంలో శివారు ప్రాంతాలు శరవేగంగా విస్తరిస్తున్నాయని తెలుస్తోంది.
పోటీతత్వంలో నాలుగో స్థానం
పెట్టుబడుల ప్రవాహం, పోటీతత్వం, కొత్త కంపెనీల స్థాపనకు దేశ వ్యాప్తంగా అనుకూలమైన నగరాలను పరిశీలిస్తే (2010కి ముందు స్థితి) హెచ్‌ఎంఏ ప్రాంతం దేశంలో నాలుగో స్థానంలో ఉంది. దివంగత మహానేత వైఎస్సార్ హయాంలో పారిశ్రామిక, సేవలు, పారిశ్రామిక రంగానికి ఇతోధికంగా తోడ్పాటునందించడంతో ఈ పరిస్థితి ఉండేదని లీ నివేదిక అభిప్రాయ పడింది. మౌలిక వసతులు, ఆర్థికవృద్ధి, పాలన, మానవ సామర్థ్యం, జనాభా, సంపద పంపిణీ, వ్యాపార ప్రోత్సాహకాలు, సంస్థాగత మద్దతు, ప్రభుత్వ ప్రోత్సాహం వంటి 800 అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ నివేదిక రూపొందించారు. ఇందులో 2010 నాటికి ఆయా నగరాల స్థానం ఇలా ఉంది..
మహిళల ఉపాధి అత్యల్పం
జనాభాలో సగం ఉన్న మహిళలకు హెచ్‌ఎంఏ పరిధిలో ఉపాధి కల్పన అత్యల్పంగా ఉందని లీ నివేదిక పేర్కొంది. మహిళల్లో ఫుల్‌టైం, పార్ట్‌టైం ఉపాధి పొందుతున్నవారు 6.3 శాతం కాగా, స్వయం ఉపాధి పొందుతున్నవారు 4.5 శాతం మంది మాత్రమే ఉన్నారు. మహిళల్లో 77.8 శాతం మంది ఇంటికే పరిమితమవుతున్నారని నివేదిక అంచనా వేసింది.
భవిష్యత్‌లో జన విస్ఫోటనమే..
ప్రస్తుతం హెచ్‌ఎంఏ జనాభా 95.77 లక్షలు ఉండగా, 2015 నాటికి ఇది 1.20 కోట్లకు చేరనుంది. 2041 నాటికి ఏకంగా 1.90 కోట్లకు చేరువకావడం తథ్యమని లీ అసోసియేట్స్ నివేదిక అంచనా వేసింది. మన పొరుగున ఉన్న బెంగళూరులో ప్రస్తుతం 8.5 మిలియన్ల జనాభా ఉండగా..అది 2025 నాటికి 1.22 కోట్లకు చేరనుందని అంచనా. చెన్నై నగర జనాభా ప్రస్తుతం 8.7 మిలియన్లు ఉండగా ఇది 2025 నాటికి 1.28 కోట్లకు చేరడం తథ్యమని తెలిపింది.
అక్షరాస్యత ఓకే..
హెచ్‌ఎంఏ పరిధిలో అక్షరాస్యత 80.5 శాతంగా ఉంది. ఇందులో నామమాత్రపు విద్య (ప్రాథమిక విద్య) పూర్తి చేసినవారు 45.8 శాతం. పట్టభద్రులు 10.2 శాతం, పోస్టు గ్రాడ్యుయేట్లు 3.5 శాతం ఉన్నట్టు నివేదిక లెక్కగట్టింది. పురుషుల్లో అక్షరాస్యులు 84 శాతం ఉండగా.. స్త్రీలలో 76.5 శాతం మందే అక్షరాస్యులని నివేదిక తెలిపింది.
సగం మందికి ఉపాధి కరువు
హెచ్‌ఎంఏ పరిధిలో మొత్తం జనాభాలో కేవలం 38.7 శాతం మందికి మాత్రమే ఉపాధి లభిస్తోంది. ఇది 2001లో 34.3 శాతంగా ఉంది. పరిధుల వారీగా ఉపాధి కల్పన శాతాల్లో ఈ విధంగా ఉంది..
తగ్గిన స్త్రీ-పురుష నిష్పత్తి..
చిన్న కుంటుంబంపై అన్నివర్గాల్లో అవగాహన పెరగడంతో కుటుంబ పరిమాణం తగ్గింది. 2001లో సగటు కుటుంబ పరిమాణం ఇంటికి ఐదుగురు సభ్యులుండగా ఇది 2011 నాటికి నలుగురికి చేరింది. స్త్రీ, పురుష నిష్పత్తి చూస్తే ప్రతి వెయ్యి మంది పురుషులకు కేవలం 960 మంది మాత్రమే మహిళలున్నారు. ఆడపిల్లలపై నేటికీ వివక్ష కొనసాగుతున్నట్టు లింగ నిష్పత్తిని చూస్తే తెలుస్తోందని నివేదికలో ఆందోళన వ్యక్తం చేశారు.
వసతుల కల్పనకు భారీ బడ్జెట్ అవసరం..
హైదరాబాద్ మెట్రో పాలిటన్ పరిధిలో పన్నెండో పంచవర్ష ప్రణాళిక కాలంలో మౌలిక వసతుల కల్పనకు రూ.3.94 లక్షల కోట్లు అవసరమని లీ నివేదిక అభిప్రాయపడింది. 2012-2017 మధ్య కాలంలో మం చినీరు, డ్రైనేజీ వ్యవస్థ, ఘన వ్యర్థాల నిర్వహణ, పట్టణ రహదారులు, ప్రజారవాణ తదితర వసతుల కల్పనకు ఈ నిధులు అవసరమని స్పష్టం చేసింది.