
ఆ పాఠశాలల పేర్లు వెల్లడించలేదు
► ఎక్సైజ్ డైరెక్టర్ అకున్ సబర్వాల్
బంజారాహిల్స్: ఇటీవల తాము నిర్వహించిన తనిఖీల్లో కొన్ని పాఠశాలల విద్యార్థులు డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు వెల్లడైందని, అయితే తాము ఏ స్కూల్ పేరును కూడా ప్రస్తావించలేదని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్ పబ్లిక్ స్కూల్ విద్యాశ్రమం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు బుధవారం నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్ ముఠా నుంచి సేకరించిన సమాచారం మేరకు విచారణ చేపట్టగా 1,000 మంది విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటున్నట్లు తెలిసిందన్నారు.
అయితే పాఠశాలల పేర్లు బయటకు వెల్లడించలేదన్నారు. ఆయా స్కూళ్ల ప్రిన్సిపాళ్లు, విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి పిల్లల కదలికలపై దృష్టిసారించాలని చెప్పామన్నారు. విద్యార్థుల భవిష్యత్ పాడవకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. ఇంట్లో సరైన వాతావరణం లేకపోవడంతోనే పిల్లలు డ్రగ్స్ వైపు వెళ్తున్నారన్నారు. డ్రగ్స్ తీసుకుంటున్న విద్యార్థులు హైదరాబాద్‌లోని పాఠశాలల్లోనే ఎక్కువగా ఉన్నట్లు తమ తనిఖీల్లో తేలిందన్నారు. కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ ఎస్.గోపాలకృష్ణన్, ప్రిన్సిపాల్ సి.రమాదేవి తదితరులు పాల్గొన్నారు.