తెలంగాణ రాష్ట్రానికి కొత్త హెరిటేజ్ చట్టం
- వచ్చే శాసనసభ సమావేశాల్లో బిల్లు
- శిథిలావస్థలో ఉన్న కట్టడాలను కూల్చివేసే వెసులుబాటు
- కట్టడాలతోపాటు కొత్త జాబితాలో సంస్కృతి సంప్రదాయాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి కొత్త వారసత్వ (హెరిటేజ్) చట్టం రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే శాసనసభ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇప్పటివరకు కేవలం పురాతన కట్టడాలకు మాత్రమే పరిమితమైన కేంద్ర వారసత్వ చట్టాన్ని పునర్నిర్వచించనుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలతో పాటు కట్టూ బొట్టూ, ఆహారపు అలవాట్లు, ఆచార వ్యవహారాలన్నీ వారసత్వ సంపద జాబితాలో చేరుస్తూ కొత్త చట్టం చేయనుంది. రాష్ట్రంలోని పుణ్య క్షేత్రాలు, గుళ్లూ గోపురాలు, ప్రార్థనా మందిరాలన్నీ ఈ చట్టం పరిధిలోకి తీసుకువస్తారు.
గతంలో హెరిటేజ్ జాబితాలో ఉన్న కట్టడాలను సైతం పునః సమీక్షించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాటిలో యోగ్యమైన చారిత్రక కట్టడాలను మాత్రమే చట్టంలో పొందుపరిచి రక్షణ కల్పించాలని, శిథిలావస్థకు చేరిన వాటిని కూల్చి వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కూలిపోయే వాటిని తొలగించటం ద్వారా ప్రమాదాలను నివారించటంతో పాటు ఆ భవనాలకు చెందిన స్థలాలను సద్వినియోగం చేసుకునేందుకు వీలుంటుందని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఉస్మానియా ఆసుపత్రి భవనాలను కూల్చివేసి అధునాతన ఆసుపత్రిని నిర్మించాలని గత ఏడాది ప్రభుత్వం పావులు కదిపింది. కానీ అది హెరిటేజ్ చట్టం పరిధిలో ఉండటంతో ఆ ప్రయత్నం విఫలమైంది.
ఎర్రగడ్డలోని ఛాతీ ఆసుపత్రి, సెక్రటేరియట్‌లోని జీ బ్లాక్ భవనం కూల్చి వేసే ప్రతిపాదనలన్నింటికీ వారసత్వ చట్టం అడ్డుకట్ట వేసింది. ఈ నేపథ్యంలోనే వారసత్వ చట్టానికి సవరణలు చేయాలని ప్రభుత్వం భావించింది. వారసత్వ కట్టడాలను గుర్తించేందుకు గత ఏడాది జూలైలో సీఎం నేతృత్వంలో రాష్ట్ర స్థాయిలో కమిటీని ఏర్పాటు చేసింది. సీఎస్ రాజీవ్ శర్మ వైస్ చైర్మన్‌గా ఉన్న ఈ కమిటీలో మున్సిపల్, పంచాయతీరాజ్, రెవెన్యూ, టూరిజం శాఖల ముఖ్య కార్యదర్శులు సభ్యులుగా ఉన్నారు. జిల్లాల్లోనూ కలెక్టర్ల అధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో వారసత్వ కట్టడాల గుర్తింపు బాధ్యతను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు అప్పగించారు.
ఈ కమిటీల సిఫారసులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం తెలంగాణకు కొత్త వారసత్వ చట్టం రూపకల్పనకు మొగ్గు చూపింది. ప్రస్తుతమున్న చారిత్రక కట్టడాలన్నీ కేంద్ర పురాతన కట్టడాలు, పురాతత్వ ప్రాంతాలు, అవశేషాల చట్టం 1958, 2010 ప్రకారం ప్రభుత్వ రక్షణలో ఉన్నాయి. కానీ ఈ చట్టం అమలుపై భిన్నాభిప్రాయాలు రావడం, శిథిలావస్థలో ఉన్న పురాతన కట్టడాలను కూల్చే పరిస్థితి లేకపోవటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.