ఉన్న చోటే కొత్త సచివాలయం | The new secretariat in the same place | Sakshi
Sakshi News home page

ఉన్న చోటే కొత్త సచివాలయం

Published Tue, May 17 2016 7:53 AM | Last Updated on Sat, Aug 18 2018 8:05 PM

ఉన్న చోటే కొత్త సచివాలయం - Sakshi

ఉన్న చోటే కొత్త సచివాలయం

♦ ఇప్పుడున్నది కూల్చేసి.. నూతనంగా నిర్మించాలని నిర్ణయం
♦ కొత్తగా కమిటీని ఏర్పాటు చేస్తూ సర్కారు ఉత్తర్వులు
♦ ఎర్రగడ్డలో ఏర్పాటుపై ఇబ్బందులున్నాయనే భావన
♦ సచివాలయం తరలింపును వేగవంతం చేసుకుంటున్న ఏపీ సర్కారు
♦ ఏడాది చివరికల్లా పలు బ్లాకులు ఖాళీ అయ్యే అవకాశం
♦ దీంతో అదే స్థలంలో వాస్తుకు అనుగుణంగా కొత్త భవనాల నిర్మాణం
 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త సచివాలయం నిర్మాణంపై మరో కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఎర్రగడ్డలోని ఛాతీ ఆస్పత్రి స్థలంలో కొత్త సచివాలయం నిర్మిస్తామని ఏడాది కిందట హడావుడి చేసిన ప్రభుత్వం దానిపై వెనక్కి తగ్గింది. హుస్సేన్‌సాగర్ తీరంలో ప్రస్తుత సచివాలయ స్థలంలోనే కొత్త సచివాలయాన్ని నిర్మించాలని నిర్ణయించింది. ప్రస్తుతమున్న భవనాలన్నింటినీ కూల్చివేసి... దేశంలో ఎక్కడా లేని విధంగా, అధునాతనంగా, వాస్తుకు అనుగుణంగా నూతన సచివాలయ భవన సముదాయాన్ని నిర్మించాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో సోమవారం ఓ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

వాస్తు దోషం ఉందని..!
ప్రస్తుతమున్న సచివాలయం 25 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. కానీ తీవ్రమైన వాస్తుదోషం ఉందనే కారణంతో అక్కడి నుంచి తరలించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఎర్రగడ్డలోని ఛాతీ ఆస్పత్రిని అక్కడి నుంచి తరలించి .. ఆ స్థలంలో సచివాలయం కడతామని ప్రకటించారు. దీనిపై విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎర్రగడ్డలో సచివాలయ భవనాల నిర్మాణానికి ఏకంగా రూ.150 కోట్లు కేటాయిస్తూ గత ఏడాది మార్చి 24న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఛాతీ ఆసుపత్రి పరిసరాల్లోని 72 ఎకరాల విస్తీర్ణంలో భవనాలను నిర్మిస్తామని పేర్కొంది.

దాంతోపాటు పక్కనే ఉన్న మానసిక చికిత్సాలయాన్ని కూడా తరలించి... ఆ స్థలంలో సీఎం నివాసం, అఖిల భారత సర్వీసు అధికారులకు క్వార్టర్లు నిర్మిస్తామని తెలిపింది. ఇందుకోసం ఐదుగురు అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. సర్కారు చేసిన ఈ హడావుడితో ఒకటి రెండేళ్లలో సచివాలయం తరలిపోతోందనే ప్రచారం జరిగింది. వాస్తు దోషాలున్నాయన్న కేసీఆర్... రెండు మూడునెలలకోసారి కూడా సచివాలయానికి రాకపోవడం దానికి బలం చేకూర్చింది.

సీఎస్ ఆధ్వర్యంలో కొత్త కమిటీ
ఎర్రగడ్డలో సచివాలయ నిర్మాణంపై గతేడాది వేసిన అధికారుల కమిటీని ప్రభుత్వం రద్దు చేసినట్లు తెలుస్తోంది. సీఎస్ రాజీవ్‌శర్మ చైర్మన్‌గా కొత్త కమిటీని నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఉత్తర్వులో ‘ఎర్రగడ్డలో కొత్త సచివాలయ భవనాల నిర్మాణం’ అని ప్రస్తావించిన ప్రభుత్వం... ఈసారి ఆ ప్రస్తావన లేకుండానే ఉత్తర్వులిచ్చింది. సచివాలయం భవన సముదాయంతోపాటు సీఎం నివాసం, అఖిల భారత సర్వీసు అధికారుల క్వార్టర్ల నిర్మాణాలపై ఈ ఉన్నత స్థాయి కమిటీని నియమిస్తున్నట్లు పేర్కొంది. వాస్తవానికి సీఎం కొత్త నివాసం నిర్మాణానికి ఈ ఏడాది మార్చి 5నే పునాదిరాయి వేశారు. డిజైన్ల ఖరారుతో పాటు పనులను దసరాలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అయి తే కొత్త కమిటీ సీఎం నివాసంపై ఎలాంటి అధ్యయనం చేస్తుందనేది తేలాలి. ఇక ప్రధానంగా ప్రస్తుత సచివాలయంలో ఏయే బ్లాకులను కూల్చేయాలి, కొత్త భవన సముదాయాన్ని ఎక్కడ నిర్మించాలి, రాకపోకలు సాగించే మార్గాలే దిశలో ఉండాలి, ఏ దిశలో ప్రధాన ద్వారం ఉండాలనే అంశాలపై కొత్త కమిటీ దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.
 
అభిప్రాయం మార్చుకున్న సీఎం
కొత్త సచివాలయం నిర్మాణంపై ఏడాదిలోపే ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఇటీవల అంబేద్కర్ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఎర్రగడ్డలో సచివాలయం నిర్మించే ఆలోచన విరమించుకున్నట్లు పరోక్షంగా సూచించారు. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం నిర్మాణానికి పునాదిరాయి వేసిన సీఎం... ‘హుస్సేన్‌సాగర్‌లో బుద్ధుడు, ఆ వెనుకే అంబేడ్కర్, అదే వరుసలో సచివాలయం ఉంటా’యని పేర్కొనడం గమనార్హం. ఇక ప్రస్తుత సచివాలయంలో ఏపీ సెక్రటేరియట్‌తో పాటు తెలంగాణ సెక్రటేరియట్‌కు వేర్వేరు బ్లాకులున్నాయి.

ఏపీ సర్కారు ఇటీవల అమరావతిలో కొత్త సచివాలయం నిర్మాణంతో పాటు తమ ఉద్యోగులను అక్కడికి తరలించే ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో ఏడాది చివరిలోగా ఏపీ అధీనంలోని కొన్ని బ్లాక్‌లు ఖాళీ అవుతాయని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఎర్రగడ్డలో ఆసుపత్రిని తరలించి కొత్త నిర్మాణాలు చేపట్టే కంటే.. ఇప్పుడున్న చోటే వాస్తుకు అనుగుణంగా కొత్త భవనాలు నిర్మించే ప్రత్యామ్నాయంపై దృష్టి సారించింది. ట్రాఫిక్ సమస్యలు, సీఎం, మంత్రులు, వీఐపీల రాకపోకలు, రవాణా, ప్రజల సౌలభ్యం దృష్ట్యా... ఎర్రగడ్డతో పోలిస్తే ఇప్పుడున్న సచివాలయ స్థలం ఎంతో మేలనే అభిప్రాయాలు ఉన్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement