నోటిఫికేషన్లు ఇద్దామా.. వద్దా?
గ్రూప్స్‌పై టీఎస్‌పీఎస్సీ తర్జనభర్జన
♦ వయో పరిమితి తంటాను దాటేదెలా?
♦ మరిన్ని పోస్టులు వచ్చేదాకా ఎదురు చూద్దామా?
♦ నోటిఫికేషన్ ఇవ్వకపోతే అభ్యర్థులకు వయో పరిమితి సమస్య
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లక్షల మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న గ్రూప్స్ నోటిఫికేషన్లకు వయో పరిమితి సమస్య ఏర్పడింది. ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశం ఉన్నా.. పోస్టులు తక్కువగా ఉండటంతో టీఎస్‌పీఎస్సీ తర్జనభర్జన పడుతోంది. ప్రభుత్వం మరిన్ని పోస్టులకు అనుమతి ఇస్తుందేమోన ని రెండు నెలలుగా ఎదురుచూస్తోంది. కానీ అదనపు పోస్టులకు ఇప్పటివరకు సీఎం ఆమోద ముద్ర పడలేదు. ఈ నెల 31లోగా నోటిఫికేషన్లు ఇవ్వకపోతే కొంతమంది అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితి సమస్యగా మారనుంది.
కొంతమందికి పదేళ్ల వయోపరిమితి పెంపు వర్తించని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ల జారీపై ఏం చేయాలన్న అంశంపై కమిషన్ వర్గాలు త ర్జనభర్జన పడుతున్నాయి. ఇప్పటివరకు ప్రభుత్వం అనుమతిచ్చిన పోస్టుల్లో గ్రూప్-1 పోస్టులు 52 మాత్రమే ఉండగా, గ్రూప్-2 పోస్టులు 434 ఉన్నాయి. గ్రూప్-3, గ్రూప్-4 పోస్టులే లేవు. గ్రూప్-2 కోసమే దాదాపు 5 ల క్షల మంది ఎదురుచూస్తున్నారు.
ఏడాది వర్తించేలా ఉత్తర్వులు ఇచ్చినా..: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితిని పదేళ్లు సడలిస్తూ ప్రభుత్వం ఈ ఏడాది జూలై 27న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జనరల్ అభ్యర్థుల వయో పరిమితి 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెరిగింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఉద్యోగులకు అదనంగా రిజర్వేషన్లు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. పైగా ఆ ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుంచి ఏడాది పాటు వయోపరిమితి సడలింపు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది.
ఉద్యోగ నియామకాల నిబంధనల ప్రకారం.. ఏ యేడాదిలోప్రభుత్వం గరిష్ట వయో పరిమితిని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేస్తుందో ఆ ఏడాదిలో వచ్చే నోటిఫికేషన్లకు డిసెంబరు 31కి కటాఫ్ అవుతుంది. అంటే 2015 డిసెంబర్ 31లోగా జారీ అయిన ప్రతి నోటిఫికేషన్ 2015లో జారీ అయినట్లే. ప్రభుత్వం వయోపరిమితిని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది కనుక 2015 జూలై 27 నాటికి 44 ఏళ్ల లోపు ఉన్న జనరల్ అభ్యర్థులు ఈ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులవుతారు. అదే డిసెంబర్ 31 తర్వాత నోటిఫికేషన్లు జారీ అయితే కటాఫ్ సంవత్సరం 2016 అవుతుంది. దీంతో వారు (45 ఏళ్లకు వస్తారు) అనర్హులవుతారు. ఈ నెల 31లోగా గ్రూప్-1, గ్రూప్-2, ఇతర కేటగిరీల పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వాలా? లేదా? ఆనే ఆలోచన ల్లో కమిషన్ వర్గాలు ఉన్నాయి.
ఉన్న పోస్టులకే నోటిఫికేషన్లు ఇచ్చేద్దామా?: ఇప్పటికే ప్రభుత్వం ఆమోదం లభించి, నియామకాల కోసం టీఎస్‌పీఎస్సీకి పంపించిన పోస్టులకు ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్లు ఇచ్చేద్దామా అన్న ఆలోచన కూడా కమిషన్ చేస్తోంది. ఇదే సమయంలో ఎక్కువ పోస్టులు వచ్చాకే నోటిఫికేషన్లు జారీ చేస్తేనే మంచిదన్న ఆలోచనలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేయడం ద్వారా వయో పరిమితి పెంపు ఉత్తర్వులు నిరుద్యోగులకు వర్తిస్తాయి. ఇప్పటివరకు ఉన్న పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేసి, ప్రభుత్వం నుంచి అదనపు పోస్టులు వచ్చాక.. సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి వాటిని, ఇపుడు ఇచ్చే నోటిఫికేషన్ పరిధిలోకే (2015 నోటిఫికేషన్ కిందకు) తెస్తే సమస్య ఉండదన్న భావన ఉంది.