పామాయిల్ ‘సుంకం’ పోటు
♦ 80 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గిన సుంకం
♦ దాంతో విదేశాల నుంచి వెల్లువెత్తుతున్న ఆయిల్
♦ తీవ్రంగా నష్టపోతున్న రాష్ట్ర పామాయిల్ సాగు రైతులు
సాక్షి, హైదరాబాద్: క్రూడ్ పామాయిల్, రిఫైన్డ్ పామాయిల్ దిగుమతి సుంకం భారీగా తగ్గడంతో విదేశాల నుంచి వాటి దిగుమతులు వెల్లువెత్తుతున్నాయి. దాంతో పామాయిల్ సాగు చేస్తున్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. టన్ను పామాయిల్ గెల ఏడాదిన్నర కాలంలోనే ఏకంగా రూ.2,500కు మించి తగ్గడంతో ఆ తోటలను సాగు చేస్తున్న రైతులు ఆర్థికంగా కుదేలవుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్ముందు పామాయిల్ సాగు రైతుకు నష్టదాయకంగా మారుతుందని తెలంగాణ సర్కారు ఆందోళన వ్యక్తం చేస్తోంది. పామాయిల్ దిగుమతి సుంకాన్ని పెంచాలంటూ ఆయిల్‌ఫెడ్ గతంలోనే కేంద్రానికి లేఖ రాసినా లాభం లేకపోయింది.
80 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గుదల
ప్రస్తుతం రాష్ట్రంలో 31 వేల ఎకరాల్లో పామాయిల్ తోటలున్నాయి. ఆయిల్‌ఫాం గెలల నుంచి క్రూడ్ పామాయిల్ తీస్తారు. ఇందుకోసం అశ్వారావుపేటలో ఆయిల్‌ఫాం గెలల క్రషింగ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు. జాతీయంగా క్రూడ్ పామాయిల్ ధరలను బట్టి రైతులకిచ్చే ధరను నిర్ణయిస్తారు. క్రూడ్, రిఫైన్డ్ పామాయిల్ దిగుమతుల సుంకాన్ని కేంద్రం భారీగా తగ్గించడంతో ఇండోనేసియా, థాయ్‌లాండ్, చైనా, ఈజిఫ్టు, బంగ్లాదేశ్‌లతో పాటు పలు ఐరోపా దేశాల నుంచి పామాయిల్ పెద్ద ఎత్తున దేశంలోకి ప్రవహిస్తోంది.
విదేశాల నుంచి వాటి దిగుమతులు భారీగా పెరిగాయి. 2005 ఫిబ్రవరిలో 80 శాతమున్న క్రూడ్ పామాయిల్ దిగుమతి సుంకాన్ని 2014 డిసెంబర్ నాటికి ఏకంగా 7.5 శాతానికి కేంద్రం తగ్గించింది. 2001 అక్టోబర్‌లో 92.2 శాతమున్న రిఫైన్డ్ పామాయిల్ దిగుమతి సుంకాన్ని 2014 జనవరిలో 10 శాతానికి తగ్గించింది. దాంతో 2010-11లో 83.7 లక్షల మెట్రిక్ టన్నులున్న రిఫైన్డ్ పామాయిల్ దిగుమతులు 2014-15లో ఏకంగా 1.23 కోట్ల మెట్రిక్ టన్నులకు చేరాయి. ఈ దెబ్బకు దేశంలో క్రూడ్ పామాయిల్ ధరలు భారీగా పడిపోయాయి. 2014 మార్చిలో క్రూడ్ పామాయిల్ టన్ను రూ.58,105 ఉండగా గత అక్టోబర్‌లో ఏకంగా రూ.39,449కి పడిపోయింది. రైతుకు టన్ను రూ.8,441 పలికిన పామాయిల్ గెలల ధర కూడా కూడా రూ.5,757కు పడిపోయింది. తెలంగాణ రైతులు ఏడాదికి 75 వేల టన్నులు క్రషింగ్‌కు తరలిస్తున్నారు. ఆ లెక్కన వారు ఏటా రూ.20.13 కోట్లు నష్టపోతున్నారు.
దిగుమతి సుంకాన్ని కనీసం 50 శాతం పెంచాలి
క్రూడ్ పామాయిల్ దిగుమతి సుంకాన్ని కనీసం 40 నుంచి 50 శాతానికైనా పెంచితే రైతుకు మరింత మేలు జరుగుతుంది
- ఆయిల్‌ఫెడ్ సీనియర్ మేనేజర్ రంగారెడ్డి