మూడో కేంద్రం మూసివేత
సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే మహబూబ్‌నగర్, హైదరాబాద్ విద్యానగర్‌లోని ఆరోగ్య శిక్షణ కేంద్రాలకు తాళాలు వేసిన ఆంధ్ర మహిళా సభ యాజమాన్యం సంగారెడ్డిలో మరో కేంద్రాన్ని మూసేసింది. గురువారం అర్ధరాత్రి ఈ కేంద్రానికి తాళం వేసింది. దీంతో తెలంగాణలోని మొత్తం 3 సెంటర్లు మూతపడ్డాయి. ఇందులో దాదాపు 60 మంది పేద విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. ఉన్నట్టుండి ఇలా సెంటర్లు మూసివేస్తే తమ భవిష్యత్తు ఏమౌతుందని విద్యార్థులు, అందులో పని చేస్తున్న ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తమ కోసం ‘తెలంగాణ మహిళా సభ’ను ఏర్పాటు చేయాలని, ఎలాంటి ఆటంకాలు లేకుండా శిక్షణ తరగతులు నిర్వహించాలని కోరుతున్నారు. ఈ సెంటర్ల స్థలాలు ఆంధ్ర మహిళా సభ యాజమాన్యానివి కావడం వల్లే ఇలాంటి దౌర్జన్యానికి ఒడికట్టారని సెంటర్ల ప్రిన్సిపల్స్ అభిప్రాయపడుతున్నారు.
ముందస్తు సమాచారం కూడా లేకుండా..
శిక్షణ కేంద్రాల మూసివేతపై గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై సంగారెడ్డి జిల్లా వైద్యాధికారి అమర్‌సింగ్ స్పందించారు. విద్యార్థుల సమస్యలను రాష్ట్ర వైద్యశాఖ అధికారులకు వివరించారు. త్వరలోనే శిక్షణకు అయ్యే గ్రాంటును విడుదల చే స్తామని అధికారులు చెప్పినట్టు ఆయన ‘సాక్షి’కి తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్ర మహిళా సభ యాజమాన్యం తీరుపై మండిపడ్డారు. యాభై ఏళ్లుగా నిర్విరామంగా శిక్షణ తరగతుల్ని నిర్వహిస్తున్న సెంటర్‌కి తాళం వేసే ముందు కనీసం జిల్లా కలెక్టర్‌కుగానీ, జిల్లా వైద్యాధికారికిగానీ చెప్పలేదని, ఆంధ్ర మహిళా సభ యాజమాన్యంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.
10 నెలల కిందటే మూసేయాల్సింది!
శిక్షణ కేంద్రాల మూసివేత, విద్యార్థుల భవిష్యత్తుపై ఆంధ్ర మహిళా సభ ఉపాధ్యక్షురాలు ఉషారెడ్డిని ప్రశ్నించగా.. ‘‘ఇంత పెద్ద సంస్థను నడుపుతున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న సమస్యలు రావడం చాలా సహజం. నిజానికి పది నెలల క్రితమే ఈ సంస్థలకు గ్రాంట్ ఇవ్వలేమని రాష్ట్ర ప్రభుత్వం మాకు తెలిపింది. అప్పుడే మూసేయాల్సింది. అప్పట్లో యాజమాన్య సభ్యులు ఆ పని చేయలేదు. మూడు నెలల క్రితం కొత్తగా వచ్చిన మా టీం సెంటర్లను మూసేయాలన్న నిర్ణయం తీసుకుంది’’ అని సమాధానమిచ్చారు. అలాం టప్పుడు విద్యార్థులను సెంటర్లలో ఎందుకు చేర్చుకున్నారని అడగ్గా.. ‘‘ఇప్పుడు చెప్పడం వల్ల ఏం నష్టం జరిగింది? ఉచితంగా ఇచ్చే శిక్షణే కదా!’’ అని వ్యాఖ్యానించారు.
రోడ్డున పడ్డ బతుకులు
శ్రీను అనే వృద్ధుడు విద్యానగర్ హెల్త్ సెంటర్‌లో గత కొన్నేళ్లుగా వంట మని షిగా పనిచేస్తున్నాడు. ఆయన పెద్ద కూతురు ఉష రోడ్డు ప్రమాదంలో భర్తను పోగొట్టుకుని తండ్రి చెంతకు వచ్చింది. ఇంటర్ చదువుకున్న ఉషను గత నెలలో ఈ శిక్షణ కేంద్రంలో చేర్పించాడు. పేద మహిళలకు, భర్తను పోగొట్టుకున్న మహిళలకు శిక్షణ ఇచ్చే ఈ కేంద్రాల్లో ఉషలాంటి వారు చాలా మంది ఉన్నారు. ఉన్నట్టుండి సెంటర్లను మూసేయడంతో వారంతా రోడ్డున పడ్డారు. ‘‘ఈ సెంటర్‌లో రెండేళ్లు నా బిడ్డ పని నేర్చుకుంటే ఆ తర్వాత ఆమె భవిష్యత్తు మంచిగుంటదని ఎన్నో ఆశలు పెట్టుకున్న. ఇట్ల ఈ సెంటర్ మూసేస్తరని మాకు తెల్వదు. రెండో బిడ్డకు పెళ్లి చేయడం కోసం ఆరోగ్యం బాగలేకపోయినా ఏవో తిప్పలు పడుతున్న..’’ అని శ్రీను గోడు వెళ్లబోసుకున్నాడు.