
యువసైన్యం
ఫిలిప్ వీస్.. ‘ది సినర్జిస్ట్’ కో ఫౌండర్.. ‘హైపర్ థింకింగ్’.. ఆథర్.. మెట్రోపొలిస్‌లో స్పీకర్.. బెల్జియం దేశస్తుడైనా ఈ దేశంతో.. ఈ సిటీతో
జన్మబంధం ఉన్నవాడు.. మూడుముళ్ల అనుబంధం కలుపుకున్నవాడు.. ‘సిటీప్లస్’తో ఇలా మాటకలిపాడు...
మా అమ్మ బ్రిటిషర్. నాన్న జర్మన్. నేను పెళ్లిచేసుకుంది మహారాష్ట్రియన్ అమ్మాయిని. పెళ్లయి పదిహేనేళ్లవుతోంది. కాని ఇండియాతో అంతకు ముందునుంచే అనుబంధం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్‌తో. మా తాత (అమ్మ వాళ్ల నాన్న) నిజాం దగ్గర ఉద్యోగస్తుడు. అమ్మ ఇక్కడే పుట్టింది. చాన్నాళ్ల కిందట హైదరాబాద్ వచ్చాను. అప్పుడు ఫలక్‌నుమా ప్యాలెస్ చూశాను. బ్యూటిఫుల్ ప్యాలెస్.
మార్పు సులభం..
హైదరాబాద్ మార్పును ఆహ్వానిస్తుంది. నిత్యనూతనంగా ఉండడానికి ఉవ్విళ్లూరుతుంది. చేంజ్ కావడానికి రియల్ విల్లింగ్‌నెస్ కనిపిస్తుంటుంది. ఇక్కడి యూత్‌లో చాలా ఎనర్జీ ఉంది. అయితే గాంధీగారన్నట్టు.. సమాజాన్ని మార్చాలనుకునే ముందు నిన్ను నువ్వు మార్చుకోవాలి. నేను రాసిన హైపర్‌థింకింగ్ పుస్తకంలోనూ ఇదే ఉంటుంది. ఇండియా వైవిధ్యాల సమ్మేళనం. వీటన్నింటినీ కలిపితే అద్భుతమైన శక్తిగా మారుతుంది. కోరిక బలంగా ఉంటే మార్పు సులభమవుతుంది. ఇక్కడ అవకాశాలు ఎక్కువ. వాటిని అందుకుని కలలను సాకారం చేసుకునే యూత్ కూడా ఎక్కువే. మెట్రోపొలిస్ హాకథాన్‌లో పాల్గొన్న యువత అవగాహన, ఐడియాలు, ప్లానింగ్, ఆసక్తి చూస్తుంటే ముచ్చటేసింది. వాళ్లఆశావాదం అబ్బురపరిచింది. ఏ సమాజానికైనా కావల్సింది ఇలాంటి యువతే కదా.
స్మార్ట్ అంటే ..
స్మార్ట్ సిటీస్ అంటే కేవలం టెక్నాలజీ బేస్ కాదు..మనసులో ఉన్న ఆలోచనను పంచుకొని ఆచరణలో పెట్టడమే. అభివృద్ధికి సులువైన మార్గాలు అన్వేషించడమే. అలాంటి వాటికి ఇలాంటి గ్యాదరింగ్స్ చాలా ఉపయోగపడతాయి. సవాళ్లున్న చోటే పరిష్కారాలుంటాయి.వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇండియాలాంటి దేశానికి.. ముఖ్యంగా హైదరాబాద్‌లాంటి నగరంలో ఈ మెట్రోపొలిస్ మీట్ జరగడం ఎంతో హెల్ప్ అవుతుంది.