ఆరు లక్షల బైక్‌తో తుర్రుమన్నాడు
ట్రయల్ ‘రన్’
హైదరాబాద్: రిచ్ లుక్ తో వచ్చాడు.. ఖరీదైన బైక్ వివరాలడిగాడు.. ట్రయల్ రన్ వేస్తానని చెప్పాడు.. షాపు యజమానులకు షాక్ ఇస్తూ ఆరు లక్షల బైక్‌తో తుర్రుమన్నాడు. హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...హార్లీ డేవిడ్‌సన్ బైక్‌కు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ద్విచక్ర వాహనంగా పేరుంది. ఒక రకంగా యువత కలల బైక్ కూడా ఇదేనని చెప్పొచ్చు. ఇలాంటి బైక్‌లు కొనలేని వారు వాటిని షోరూంలో చూసి, వీలుంటే ట్రయల్న్ ్రవేసి, సెల్ఫీలు తీసుకొని తెగ ఆనందపడిపోతుంటారు. కానీ, ఓ ప్రబుద్ధుడు మాత్రం చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండానే ఈ ఖరీదైన బైక్‌ను సొంతం చేసుకునేందుకు పథకం పన్నాడు. బంజారాహిల్స్ సాగర్ సొసైటీ చౌరస్తాలో ఉన్న హార్లీ డేవిడ్‌సన్ షోరూంకు మంగళవారం ఆధునిక దుస్తుల్లో ఓ యువకుడు వచ్చాడు. అక్కడివారిని కొత్త బైక్‌ల వివరాలను అడిగి తెలుసుకున్నాడు. తన పేరు సయ్యద్ తాహెర్ అని పరిచయం చేసుకున్నాడు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను అని నెలకు రూ.లక్షన్నర జీతం ఉంటుందని నమ్మబలికాడు. జూబ్లీహిల్స్ రోడ్ నం. 23లో నివాసముంటున్నట్లు చెప్పాడు. కొత్తగా వచ్చిన హార్లీడేవిడ్‌సన్ స్ట్రీట్ 750 మోడల్ బైక్ కావాలంటూ బేరమాడాడు. క్రెడిట్‌కార్డులను కూడా చూపించాడు. ట్రయల్ రన్ వేస్తానని చెప్పాడు.
ఇంకేముంది తప్పకుండా కొనుగోలు చేస్తాడని షోరూం నిర్వాహకులు భావించారు. అతడికి బైక్ తాళం చెవి అప్పగించారు. దర్జాగా ట్రయిల్ రన్‌కు వెళ్లండి అంటూ టాటా చెప్పారు. అంతే యమా స్పీడ్‌తో అక్కడ నుంచి దూసుకెళ్లిన తాహీర్ తిరిగిరాలేదు. మూడు గంటలు గడిచినా షోరూం నిర్వాహకులకు పరిస్థితి అర్థం కాలేదు. చివరికి అతడు వచ్చింది కొనడానికి కాదు కొట్టేయడానికి అని ఆలస్యంగా తెలియడంతో వెంటనే అతడు ఇచ్చిన నంబర్‌కు ఫోన్ చేశారు. స్విచ్చాఫ్ రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ సీఐ పి. మురళీకృష్ణ ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. సీసీ ఫుటేజీలు పరిశీలించారు. యువకుడి ఊహాచిత్రాన్ని రూపొందిస్తున్నారు.