ఇస్లాంలో ఉగ్రవాదానికి స్థానం లేదు
జమాతే ఇస్లామీ హింద్ సర్వసభ్య సమావేశాలు ప్రారంభం
పహాడీషరీఫ్: ఇస్లాం మతానికి, ఉగ్రవాదానికి ఎలాంటి సంబంధం లేదని జమాతే ఇస్లామీ హింద్ జాతీయ అధ్యక్షుడు మౌలానా సయ్యద్ జలాలుద్దీన్ ఉమర్ అన్నారు. పహాడీషరీఫ్ వాదే హుదా దాలోని జామియా దారుల్ హుదా మదర్సాలో నాలుగు రోజుల పాటు జరిగే జమాతే ఇస్లామీ హింద్ సర్వసభ్య సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...నేడు ప్రపంచంలో తీవ్రవాద సమస్య ప్రధానంగా నెలకొందన్నారు. ఇస్లాం మతంలో తీవ్రవాదానికి స్థానం లేదన్నారు. మోడీ ప్రభుత్వంలోని కేంద్ర మంత్రులు విద్వేషం పెంచి పోషించేలా నోరు పారేసుకుంటూ దేశంలో అసహనం పరాకాష్టకు చేరేలా వ్యవహరిస్తున్నారన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ విధానాలను సంఘ్ పూర్తిగా కాషాయికరణ చేసేందుకు కుట్ర చేస్తుందన్నారు. దేశం నలుమూలల నుంచి జమాతే ఇస్లామీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సైబరాబాద్ పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు.
మాదాపూర్ డీసీపీ కార్తికేయ, శంషాబాద్ ఏసీపీ అనురాధ, పహాడీషరీఫ్ ఇన్‌స్పెక్టర్ వి.వి.ఛలపతిల పర్యవేక్షణలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. జామియా దారుల్ హుదా మదర్సా ఆవరణలో పెద్ద ఎత్తున స్టాల్స్ ఏర్పాటు చేశారు. దీంతో పాటు వివిధ కళాఖండాలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ అందరిని ఆకట్టుకుంటుంది.
నేడు బహిరంగ సభ
ఈ సమావేశాలలో భాగంగా రెండో రోజైన 12వతేదీ సాయంత్రం 6 గంటలకు బహిరంగ సభ నిర్వహించనున్నట్లు జామాతే ఇస్లామి హిందూ సంస్థ సభ్యులు తెలి పారు. ‘సమాజ పునర్నిర్మాణం-మన బాధ్యతలు’ అనే అంశంపై రాజకీయ, ధార్మిక పండితులు, మేధావులు ప్రసంగించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఈ బహిరంగ సభలో పాల్గొననున్నారు.