
అంబేడ్కర్‌నూ వాడుకుంటున్నారు
కాల్‌మనీ అంశాన్ని పక్కదోవ పట్టించేందుకు అంబేద్కర్‌ను కూడా అధికారపక్షం వాడుకుంటోందని, దీనివల్ల ఆయన ఆత్మ కూడా క్షోభిస్తుందని అసెంబ్లీలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
* పైనున్న ఆయన ఆత్మ క్షోభిస్తుంది
* ‘కాల్ మనీ-సెక్స్ రాకెట్’ అంశాన్ని పక్కదోవ పట్టిస్తున్నారు
* సాక్షాత్తూ చంద్రబాబుతో నిందితుల ఫొటోలున్నాయి
* నిందితుడితో కలసి ఎమ్మెల్యే విదేశాల్లో విహరించారు
* ఎమ్మెల్యే వచ్చినా.. నిందితుడు తిరిగి రాలేదు
* ఆ ఎమ్మెల్యేను కనీసం విచారించనూ లేదు
* ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తిన ప్రతిపక్ష నేత జగన్
సాక్షి, హైదరాబాద్: ‘కాల్ మనీ-సెక్స్ రాకెట్’ అంశాన్ని పక్కదోవ పట్టించడానికి అధికార పక్షం రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను కూడా వాడుకుంటోందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. శాసనసభ సమావేశాల్లో తొలిరోజు గురువారం విపక్ష నేతకు రెండుసార్లు మాట్లాడే అవకాశం ఇచ్చినట్లే ఇచ్చి మైక్ కట్ చేశారు. రెండుసార్లూ జగన్ మూడు వాక్యాలైనా మాట్లాడకముందే స్పీకర్ మైక్‌ను కట్ చేశారు. సభ ప్రారంభంలో విపక్ష నేతకు మైక్ ఇచ్చినప్పుడు.. ‘సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో నిందితులు ఉన్న ఫోటోలున్నాయి.
నిఘా విభాగం అధిపతి(ఇంటెలిజెన్స్ చీఫ్)తో నిందితులు ఉన్న ఫోటోలూ ఉన్నాయి. నిందితుడితో కలసి ఎమ్మెల్యే విదేశాల్లో విహరిస్తున్న ఫోటోలూ..’ అంటూ మాట్లాడుతుండగానే అర్ధంతరంగా మైక్ మూగబోయింది. తొలి వాయిదా అనంతరం సభ సమావేశమైనప్పుడు కూడా విపక్ష నేతకు మైక్ ఇచ్చినట్లే ఇచ్చి తొలగించారు. ‘అంబేడ్కర్-రాజ్యాంగం’ అంశం మీద పార్లమెంట్‌లో చర్చ జరిగిందని, ఆ అంశం మీద శాసనసభలోనూ చర్చిద్దామని అధికార పక్షం గట్టిగా కోరింది.
అంబేడ్కర్ మీద చర్చను విపక్షం అడ్డుకుంటోందని అధికారపక్ష సభ్యులు విమర్శించారు. రెండోసారి విపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇచ్చినప్పుడు.. ‘నిజంగా.. పైనున్న అంబేడ్కర్ గారి ఆత్మ క్షోభిస్తుంది. కాల్‌మనీ-సెక్స్ రాకెట్ అంశాన్ని, దానిపై చర్చను పక్కదారి పట్టించడానికి అంబేడ్కర్‌నూ వాడుకుంటున్నారు.
ఈ ఫొటో చూడండి.. (ఫొటో చూపిస్తూ..) ఒక నిందితుడు ఎమ్మెల్యేతో పాటు విదేశాలకు వెళ్లాడు. ఎమ్మెల్యే తిరిగి వచ్చారు. నిందితుడు మాత్రం రాలేదు. కానీ.. ఎమ్మెల్యేను పోలీసులు కనీసం విచారణ కూడా చేయలేదు. ఇంత దారుణంగా పరిస్థితి ఉంది’ అంటూ తన ప్రసంగాన్ని కొనసాగిస్తుండగా, అర్ధంతరంగా మైక్ కట్ చేశారు.