ఒకే ఇంట్లో రెండు సార్లు దొంగ తనం చేశాడు. అంతేకాదు.. గోడ మీద.. తన దొంగ తనానిక గుర్తుగా.. సారీ అంటూ స్కెచ్ పెన్ తో రాశాడో వింత దొంగ.. కన్నం వేసిన ఇంటికే మరో సారి వెళ్లి... రెండో సారీ రాశాడు.. ఇంట్లో ఉన్నదంతా ఊడ్చుకు వెళ్లాడు. గోడమీద మరో 'సారీ' కూడా చెప్పెళ్లాడు.. పోలీసులకే సవాల్ విసిరిన ఈ చోరీ ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెం 14లోని బీఎన్‌రెడ్డి కాలనీ ప్లాట్‌నెం 36లో వ్యాపారి ప్రదీప్ రంగనాధన్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి ఇంటిలో గత నెల 31వ తేదీన ఆగంతకులు ఇంట్లోకి ప్రవేశించి బెడ్‌రూమ్‌లోని బీరువాలో ఉన్న అమెరికన్ డాలర్లు, బంగారు ఆభరణాలు, కెమెరాలు, ఐఫోన్లు తస్కరించాడు. ఈ దొంగతనం చేసినందుకు క్షమాపణలు చెబుతూ గోడపై స్కెచ్‌పెన్‌తో 'సారీ' అంటూ రాసి పరారయ్యాడు దొంగ.అదే రోజు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా క్లూస్ టీం, క్రైం పోలీసులు ఘటనాస్థలంలో ఆధారాలు సేకరించారు.
ఒక వైపు ఈ దర్యాప్తు జరుగుతుండగానే బుధవారం రాత్రి సదరు దొంగ మరోసారి ఇంట్లోకి ప్రవేశించి విలువైన ఆభరణాలతో పాటు లాకెట్, రూ.6వేల నగదు ఎత్తుకెళ్లాడు. మొదటిసారి ఎక్కడైతే సారీ అని రాశాడో సరిగ్గా అదే ప్రాంతంలో మరోసారి 'సారీ' అంటూ రాసి పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన క్రైం పోలీసులు, క్లూస్ టీం సంఘటనా స్థలంలో వేలిముద్రలను సరిచూడగా రెండుసార్లు వచ్చింది ఓకే వ్యక్తి అని తేలింది.
ఈ వింత పరిస్థితికి ఎలా రియాక్ట్ కావాలో ఇంటివారికి అర్ధం కావడంలేదు..ఒకే ఇంట్లో మూడు వారాల వ్యవధిలో ఒకే దొంగ చోరీకి పాల్పడడంతో పాటు సారీ అంటూ రాయడంతో పోలీసులు వింత దొంగకోసం గాలింపు చేపట్టారు.