- ప్రభుత్వంపై ఒత్తిడి పెంచిన మైనింగ్ మాఫియా
- దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగానే ఎన్‌కౌంటర్
సాక్షి, హైదరాబాద్: ఏఓబీలో మావోయిస్టులను మట్టుబెట్టేందుకు ఏపీ ప్రభుత్వం దీర్ఘ కాలిక ప్రణాళిక రచించిందా? బాక్సైట్ మైనింగ్‌కు అడ్డుగా నిలుస్తున్నందునే అడ్డు తొలగించుకునే వ్యూహాన్ని అమలు చేసిందా? ఏఓబీపై పూర్తి స్థాయి పట్టు సాధించిన మావోయిస్టు నేత గాజర్ల రవి అలియాస్ గణేశ్ అలియాస్ ఉదయ్‌ని రెండేళ్లుగా వెంటాడుతోందా? ఏఓబీ ఎన్‌కౌంటర్‌ను విశ్లేషిస్తున్న వర్గాలు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించినవారిలో ఏఓబీ నేత, భూపాల్‌పల్లి జిల్లా (పాత వరంగల్) టేకుమట్ల మండలం (పాత చిట్యాల) వెలిశాలకు చెందిన గాజర్ల రవి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆయన ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారు. అందుకే ఈ ప్రాంతంలో ముఖ్య నాయకులు కోసం పోలీసు బలగాలు రెండేళ్లుగా వేట మొదలు పెట్టాయని తెలుస్తోంది.
మైనింగ్ మాఫియా ఒత్తిడి?
ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో మైనింగ్ కార్యకలాపాలు చేపట్టాలని ఉమ్మడి రాష్ట్రంగా ఉండగానే అప్పటి సీఎం హోదాలో చంద్రబాబు ప్రయత్నాలు మొదలు పెట్టారు. 2000లోనే దుబాయ్‌కి చెందిన ఒక మైనింగ్ కంపెనీకి 2 వేల ఎకరాలను ధారాద త్తం చేసేందుకు ప్రయత్నించారు. అయితే షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గ్రామ సభ అనుమతి లేకుండా ఏ కార్యక్రమం చేపట్టే వీల్లేదు. ఈ మేరకు సుప్రీంకోర్టు కూడా (సమతా వర్సెస్ ఏపీ స్టేట్) స్పష్టంగా చెప్పింది. దీంతో నాటి సీఎంగా చంద్రబాబు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర సీఎంలతో మాట్లాడి.. గ్రామసభ అనుమతి అక్కర్లేదన్న రాజ్యాంగ సవరణ తీసుకువచ్చే యత్నం చేశారని పేర్కొంటున్నారు. తాజాగా కాకినాడ-విశాఖపట్నం ఇండస్ట్రియల్ కారిడార్, కోస్టల్ కారిడార్, కొవ్వాడ వజ్రాల గనులు, బాక్సైట్ గనులు, శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేయతలపెట్టిన 8 పవర్ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవాలంటే ఏఓబీలో అడ్డంకిగా ఉన్న మావోయిస్టులను మట్టుబెట్టాలన్న వ్యూహాన్ని రచించినట్లు చెబుతున్నారు. మైనింగ్ మాఫియా కూడా ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది.
ఫుడ్ పాయిజనింగ్ జరిగిందా?
ఏఓబీ ఎన్‌కౌంటర్‌కు ‘ఫుడ్ పాయిజనింగ్’ కూడా కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నమ్మిన వారే ఆహారంలో విషం పెట్టడం ద్వారా గతంలో మానాల, రాచకొండ, పామేడు, పూపర్తి, అందుగుల మేధి సంఘటనలు జరిగాయని చెబుతున్నారు.
మైనింగ్ కోసమే మట్టుబెట్టారా?
Published Tue, Oct 25 2016 4:00 AM | Last Updated on Thu, Mar 28 2019 5:07 PM
Advertisement
Advertisement