
ఆరు నిమిషాల్లోనే...
ఇదీ వృద్ధుడి అపహరణ ‘దృశ్యం’
సీసీ కెమెరాలో రికార్డైన ఆధారాలు
సిటీబ్యూరో: తొమ్మిది మంది దుండగులు... ఆరు నిమిషాల నిడివి... తలుపులు పగులకొట్టి అపహరణ... స్థూలంగా ఇదీ ఒంటరి వృద్ధుడు బాలకృష్ణరావును కిడ్నాప్ చేసిన సీన్ ఈ దృశ్యాలు సైనిక్‌పురిలోని బాధితుడి ఇంటి సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. గత నెల 25 తెల్లవారుజాము 5.32 గంటల నుంచి 5.39 గంటల మధ్య నమోదైన ‘దృశ్యాలు’ ఇలా...
సీన్-1
1. ఓ చేతిలో కొన్ని పత్రాలు, మరో చేతిలో తలుపు పగుల కొట్టే ఆయుధంతో ఒకడు, అతడి వెంట మరొకడు మొదటి అంతస్తులోని బాలకృష్ణ ఇంటికి వెళ్తున్నారు. 2. వీరి వెనుకే ముసుగులు ధరించి ముగ్గురు... మామూలుగా మరో నలుగురు ఇంటి మొదటి అంతస్తులోని ఇంటి వద్దకు చేరుకున్నారు.
సీన్-2
3. బాలకృష్ణ ఇంటి తలుపులు పగులకొట్టడం పూర్తయిన తర్వాత... ఏడుగురు ఇంట్లోకి వెళ్లగా... మరో ఇద్దరు వాహనం సిద్ధం చేయడానికి కింది వచ్చారు.
4. అర్ధనగ్నంగా ఉన్న బాలకృష్ణను కాళ్లు చేతులు పట్టుకుని బలవంతంగా ఈడ్చుకుంటూ తీసుకువెళ్తున్న కిడ్నాపర్లు.
రివార్డ్స్ ప్రకటించిన సీపీ...
బాలకృష్ణ కిడ్నాప్ కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన మల్కాజిగిరి జోన్ స్పెషల్ ఆపరేషన్ టీమ్‌ను కమిషనర్ సీవీ ఆనంద్ అభినందించారు. ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్ ఎన్‌సీహెచ్ రంగస్వామితో పాటు ఎస్సై రాములు, సిబ్బంది వెంకటేశ్వర్, శ్రీరాములు, ఎన్.శ్రీనివాసులు, బ్రహ్మం, కె.శ్రీధర్‌బాబు, వెంకట్‌రెడ్డి, దిలిప్‌రెడ్డిలకు కమిషనర్ ప్రత్యేక రివార్డులను ప్రకటించారు.
ఫిర్యాదు చేస్తే వారి పైనా కేసు...
బాలకృష్ణకు ఈసీఐఎల్ చౌరస్తా సమీపంలో ఉన్న 2400 గజాల స్థలంపై కన్నేసిన మరో వర్గం మేకల శ్రీనివాస్‌యాదవ్ తదితరులపై ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు. వీరంతా ఆ స్థలంపై నకిలీ పత్రాలు సృష్టించి కాజేసేందుకు ప్రయత్నించారని బాధితుడు చెప్తున్నారని, లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు.