సహకార సంఘాల ద్వారా విత్తనాలు: పోచారం
సాక్షి, హైదరాబాద్: రుతుపవనాలు ప్రవేశిస్తున్నందున సహకార సంఘాల ద్వారా ఎక్కువ కేంద్రాలు ఏర్పాటు చేసి అందరికీ విత్తనాలు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన ఖరీఫ్‌పై అధికారులతో సమీక్షించారు. సహకార సంఘాల పరిధిలో పెద్ద గ్రామాన్ని గుర్తించి అధికారులు అక్కడికే వెళ్లి రైతులకు పర్మిట్లు ఇవ్వటంతోపాటు విత్తనాలను అక్కడే నిల్వ చేసుకోవాలని సూచించారు. పత్తి సాగు చేసే రైతులు పంట బీమా ప్రీమియం చెల్లించేందుకు ఈనెల 14తో గడువు ముగుస్తుందన్నారు.
మిరపకు జూలై 9, ఆయిల్‌పాంకు జూలై 14, వరి, మొక్కజొన్న, కంది, పెసర, మినుము తదితర పంటలకు జూలై 31తో గడువు ముగుస్తుందని పేర్కొన్నారు. ఇఫ్కో స్వర్ణోత్సవాల సందర్భంగా డీఏపీ, కాంప్లెక్స్ బస్తాపై రూ.100 తగ్గింపు ప్రకటించిందని, కోరమండల్ కూడా బస్తాపై రూ.100 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుందన్నారు. డీఏపీ బస్తా రూ.1191, కాంప్లెక్స్ రూ.866 చొప్పున విక్రయించాలని సూచించారు. రూ.లక్షలోపు పంట రుణం తీసుకున్న రైతులు వడ్డీ చెల్లించాల్సిన పనిలేదని మంత్రి చెప్పారు. రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు తీసుకున్న రుణంపై పావలా వడ్డీ చెల్లించాలన్నారు.