ఫీజుల వివరాలు ఆన్‌లైన్‌లో స్వీకరణ
వెబ్ పోర్టల్ రూపొందించిన తిరుపతిరావు కమిటీ
- వెబ్‌సైట్ ద్వారా ప్రైవేటు స్కూళ్ల ఆదాయ వ్యయాల వివరాలు సేకరణ
- త్వరలో అందుబాటులోకి వెబ్‌సైట్..
- ఆ తర్వాతే నియంత్రణ చర్యలపై పరిశీలన
- ఫీజుల నియంత్రణపై ఇతర రాష్ట్రాల్లోనూ అధ్యయనం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో వసూలు చేస్తున్న ఫీజుల వివరాలను ఆన్‌లైన్‌లో స్వీకరించాలని ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ నిర్ణయించింది. యాజమాన్యాల నుంచి తీసుకోవాల్సిన వివరాలతో కూడిన వెబ్ పోర్టల్‌ను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో రూపొందించింది. లింకును పాఠశాల విద్యా డైరెక్టర్ వెబ్‌సైట్‌కు అనుసంధానం చేసేందుకు చర్యలు చేపట్టింది. యాజమాన్యాలు సీడీఎస్‌ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి పాఠశాలలకు సంబంధించిన వివరాలు, ఫీజుల వివరాలు, ఆదాయ వ్యయాలను ఆన్‌లైన్‌లోనే పొందుపరిచేలా రూపొందించింది.
త్వరలోనే దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. వివరాలు పొందుపరిచేందుకు యాజమాన్యాలకు 15 నుంచి 20 రోజుల సమయం ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. ఆ తర్వాత వాటిని పరిశీలించి ఫీజుల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై ఓ అంచనాకు రానుంది. మరోవైపు గుజరాత్, కేరళ, తమిళనాడు తదిరత రాష్ట్రాల్లోనూ ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు చేపట్టిన చర్యలపై అధ్యయనం చేయాలని నిర్ణయించింది.
యాజమాన్యాల నుంచి లభించని స్పందన
రాష్ట్రంలో 11 వేలకు పైగా ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలను ఖరారు చేసేందుకు ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ పలు దఫాలుగా తల్లిదండ్రులతో, యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహించింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ నెలాఖరు వరకు సమావేశాలు నిర్వహించి చర్చించింది. ఇటు యాజమాన్యాలు, అటు తల్లిదండ్రుల కమిటీలు తమ వాదనలు వినిపించాయి. ఏఎఫ్‌ఆర్‌సీ తరహా విధానం ఉండాలని తల్లిదండ్రులు, కనీస, గరిష్ట ఫీజుల విధానం ఉండాలని యాజమాన్యాలు చెప్పుకొచ్చాయి.
ఆ సమావేశాల వల్ల తల్లిదండ్రుల వైఖరి, యాజమాన్యాల తీరు తెలిసిందే తప్ప నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై కమిటీ ఓ అంచనాకు రాలేకపోయింది. పైగా ప్రస్తుతం పాఠశాలల్లో వసూలు చేస్తున్న ఫీజుల విధానం ఎలా ఉందో తెలుసుకునే అవకాశం లేకుండాపోయింది. దీంతో పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో మూడేళ్లకు సంబంధించి స్కూళ్ల ఆదాయ వ్యయాల స్వీకరణకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసింది. అయితే యాజమాన్యాల నుంచి పెద్దగా స్పందన లభించలేదు. అయినా విద్యా శాఖ ఫీజుల నియంత్రణ కోసం కాకపోయినా నిబంధనల ప్రకారం పాఠశాలల వార్షిక ఆదాయ వ్యయాల వివరాలను ఇవ్వాల్సిందేనని యాజమాన్యాలకు స్పష్టం చేసింది.
స్పష్టత కోసం..
మరోవైపు తాజాగా ఆన్‌లైన్‌లో వివరాల సేకరణకు చర్యలు చేపట్టిన ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ.. అవి వస్తేనే ఫీజుల విధానం ఎలా ఉంది, పాఠశాలల ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, నియంత్రణకు ఎలాంటి సిఫారసులు చేయాలి, అన్న అంశంపై ఓ స్పష్టతకు రావచ్చని భావిస్తోంది. హడావుడిగా నివేదికలు ఇచ్చి, ఆ తర్వాత కోర్టు కేసులతో ఆగిపోయే పరిస్థితి రావద్దనే ఉద్దేశంతో కొంత సమయం పట్టినా పక్కాగా చర్యలు చేపట్టేందుకు వీలుగా సిఫారసులతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని భావిస్తోంది. అయితే ఆన్‌లైన్‌లో వివరాల సమర్పణకు ఎన్ని పాఠశాలలు ముందుకు వస్తాయో వేచి చూడాల్సిందే.