
‘గ్రేట్’ ఓటింగ్ లక్ష్యం
‘హైదరాబాద్ మహానగర పాలక ఎన్నికల నిర్వహణను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం.
♦ ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకం...ఎక్కడా రాజీపడం
♦ ప్రశాంత ఎన్నికకు.. పకడ్బందీ ఏర్పాట్లు చేశాం...
♦ ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కార్యాచరణ
♦ ప్రతి 700 మంది ఓటర్లకు ఒక పోలింగ్ బూత్
♦ ఓటర్ స్లిప్‌లు ఆన్‌లైన్‌లో సిద్ధం
♦ ప్రతి బూత్‌లో తొలి ఓటరుకు పూలతో సత్కారం
♦ ఈ మారు..‘నోటా’ను అమలు చేయలేకపోతున్నాం
♦ అభ్యర్థుల వ్యయాలపై షోడో బృందాల పర్యవేక్షణ
♦ ‘సాక్షి’ తో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి
‘హైదరాబాద్ మహానగర పాలక ఎన్నికల నిర్వహణను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. ఎన్నికల్లో ప్రజల భాగస్వామ్యాన్ని మరింతగా పెంచి స్థానిక పరిపాలనలో సచ్ఛీలురు, నిజమైన ప్రజాసేవకులే ఎన్నికయ్యే విధంగా చూస్తాం. ఎలాంటి దాపరికం, అశాంతి లేకుండా పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఫిబ్రవరి 2న ఎన్నికలు నిర్వహించబోతున్నాం. ఎన్నికల నిబంధనల అమలులో ఎక్కడా
రాజీపడబోం’ అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అనంతరం‘సాక్షి’ ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అయన అనేక విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు ఇవి...
- సాక్షి ప్రతినిధి, హైదరాబాద్
► మహానగర ఎన్నికను ప్రశాంతంగా, స్వేచ్ఛగా జరిగేందుకు ఏం చర్యలు చేపట్టారు?
నాగిరెడ్డి: హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మంగా తీసుకున్నాం. నోటిఫికేషన్ విడుదల మొదలుకుని, ప్రచారంలో నియమ నిబంధనల అమలు, ప్రశాంతంగా పోలింగ్ నిర్వహణ, పకడ్బందీగా ఓట్ల లె క్కింపు, ఫలితాల ప్రకటన కోసం విస్తృత ఏర్పాట్లు చేశాం. నగరంలో సుమారు 74 లక్షల మంది ఓటర్ల కోసం అవసరమైన సిబ్బంది, ఈవీఎంలు సిద్ధం చేశాం. స్థానికంగా ఉన్న కొరతను అధిగమించేందుకు మహారాష్ట్ర నుంచి రెండువేల ఈవీఎంలు తెప్పించాం.
► డబ్బు, అధికార దుర్వినియోగం, బెదిరింపులపై ఎలాంటి నిఘా పెట్టబోతున్నారు?
ముందే చెప్పినట్లు..ఎన్నికల నిబంధనలను ఎవరు ఉల్లంఘించినా సహించేది లేదు. పూర్తి పారదర్శకత,స్చేచ్చాయుత ఎన్నికలే మా ఎజెండా. అభ్యర్థులు డబ్బుల పంపిణీ, బెదిరింపులు, ఎవరైనా అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు మాకు ఖచ్చితమైన సమాచారం అందితే ఎవరినీ ఉపేక్షించేది లేదు. ఇక అభ్యర్థుల నామినేషన్ల వివరాలు, కేసులు, ఆస్తుల అఫిడవిట్లను మా వెబ్‌సైట్‌లో ఉంచనున్నాం. వాటిపై అభ్యంతరాలుంటే సంబంధిత రిటర్నింగ్ అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. అభ్యర్థుల వ్యయాలతో పాటు, ప్రచార సరళిని పరిశీలించేందుకు ఎన్నికల కమిషనర్ ఆధ్వర్యంలో ప్రత్యేక మొబైల్ టీంలు, షాడో బృందాలు రంగంలోకి దిగనున్నాయి.పోలింగ్ రోజున ఏదైనా బూత్‌లో 2 శాతానికి మించి టెండర్ ఓట్లు నమోదు అయితే క్షుణ్ణంగా విచారించి, అవసరమైతే రీ పోలింగ్ నిర్వహించే ఏర్పాట్లు చేస్తాం.
► ఎన్నిక ఏదైనా..మహానగరంలో పోలింగ్ శాతం పెరగకపోవడానికి కారణాలు విశ్లేషించారా...
నిజమే.. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే మహానగరంలో పోలింగ్ శాతం అధ్వాన్నంగా ఉంది. చదువుకున్న వారు, ఇతర ప్రొఫెషనల్స్ ఓటింగ్‌కు దూరంగా ఉండటమే ఇందుకు కారణం. బస్తీల్లో పోలింగ్ ఆశించిన స్థాయిల్లో జరిగింది. కాలనీలు, అపార్ట్‌మెంట్‌లు, గేటెడ్ కాలనీల బూత్‌లకు వచ్చేసరికి అతి తక్కువగా నమోదు అయ్యింది. ఈ మారు ఆ పరిస్థితి నుంచి అధిగమించే ప్లాన్ చేస్తున్నాం. ఓటు వేయటం కనీస బాధ్యత అన్న అంశాన్ని ప్రచారంలో పెడుతున్నాం. వివిధ పౌర సంస్థలు, ఎన్జీఓలతో విస్తృత ప్రచారం చేయటంతో పాటు, ఓటింగ్ స్లిప్‌లను ఆన్‌లైన్‌లోనే అందుబాటులో ఉంచుతున్నాం.
ఇప్పటికే 80 వేల ఓటరు స్లిప్‌లు డౌన్‌లోడ్ అయ్యాయి. పోలింగ్ రోజు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఇతర వాణిజ్య సముదాయాలన్నీ మూత పడనున్నాయి. ఐటీ కంపెనీలు సైతం తమ ఉద్యోగులకు ఓటు వేసుకునే వెసులుబాటు కల్పించేందుకు తగు చర్యలు చేపట్టబోతున్నాయి. ఈ మేరకు నాస్కాం ప్రతినిధులు ముందుకు వచ్చారు. సగటున 700 మంది ఓటర్లకు ఒక బూత్‌ను ఏర్పాటు చేస్తున్నాం. అన్ని బూత్‌లలో తొలి ఓటరును పూలతో సత్కరించే ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నాం. తద్వారా ఓటర్లలో మార్పునకు ప్రయత్నిస్తున్నాం.
► నగరంలో ఓటర్ల పేర్లు తొలగించారన్న ఆరోపణలు వచ్చాయి..కదా ఎంత మందిని తొలగించారు.. మళ్లీ ఎంతమందిని యాడ్ చేశారు?
అవును ..ఓటర్లను తొలగించినట్లు ఆరోపణలు వచ్చిన మాట వాస్తవమే. కానీ కావాలని తొలగించిన దాఖలాలు తక్కువే. కొత్తగా 4 లక్షల వరకు యాడ్ చేశారు. నగర పరిధిలో ఇప్పటికే 74 లక్షల మంది ఓటర్లు దాటిపోయారు. అయితే నగరంలో రెండు చోట్ల ఓట్లు ఉన్న వారి సంఖ్య 7.9 లక్షలుగా గుర్తించాం. పోలింగ్ బూత్‌ల వారిగా ఆ జాబితాను ప్రిసైడింగ్ అఫీసర్లకు అందజేశారు. రెండు చోట్ల ఓట్లు వేసేందుకు ప్రయత్నించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. రాజకీయ పార్టీలు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.