నేడు నగరంలో ఎనిమిది వేలకు పైగా పెళ్లిళ్లు
కార్తీక మాసం, బలమైన ముహూర్తం
హైదరాబాద్ : మహా నగరానికి పెళ్లి కళ వచ్చింది. పవిత్ర కార్తీక మాసం... బలమైన ముహూర్తాలు ఉండడంతో ఆదివారం పెద్ద ఎత్తున పెళ్లిళ్లు జరుగనున్నాయి. ఆదివారం ఒక్క రోజే 8 వేలకు పైగా వివాహాలు జరుగనున్నట్లు అంచనా. గత 4 నెలలుగా ముహూర్తాలు లేకపోవడం... ఆదివారం ఉదయం, రాత్రి రెండు బలమైన ముహూర్తాలు కలిసి రావడంతో ఎంతోమంది పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. దీంతో శనివారం నుంచే ఫంక్షన్ హాళ్లు, మండపాలు, కమ్యూనిటీ హాళ్ల వద్ద సందడి నెలకొంది. ఫంక్షన్ హాళ్లు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. పురోహితులకు, బాజాభజంత్రీలకు డిమాండ్ పెరిగింది.
నగరంలోని అబిడ్స్, మెహదీపట్నం, లంగర్‌హౌస్, అమీర్‌పేట్, పంజగుట్ట, తిరుమలగిరి, అల్వాల్, మేడ్చెల్, ఈసీఐఎల్, తార్నాక, రామంతాపూర్, కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మియాపూర్, చందానగర్, హైటెక్ సిటీ, ఐడీఏ బొల్లారం, మాదాపూర్, ఎల్‌బీ నగర్, హయత్‌నగర్, కర్మన్‌ఘాట్, సరూర్ నగర్, దిల్‌సుఖ్ నగర్, తదితర ప్రాంతాల్లో భారీ సంఖ్యలో వివాహాలు జరుగనున్నాయి. వీటి నిర్వహణ ఖర్చు సైతం భారీగా ఉండబోతోంది.
దివ్యమైన ముహూర్తాలు
ఉదయం 11 గంటలకు కుంభలగ్నం. గ్రహాల స్థితి ఎంతో బాగుంది. వృశ్చిక రాశిలో రవి ప్రవేశించడం. గురువు 9వ స్థానంలో ఉండడంతో మంచి ముహూర్తం. రాత్రి 8 గంటలకు మిథున లగ్నం ఉంది. ఇది కూడా మంచి ముహూర్తం. కేంద్ర స్థానంలో గురువు, 6వ స్థానంలో రవి, బలమైన స్థానంలో బుధుడు ఉన్నారు. గ్రహాలు అనుకూలంగా ఉండడం ఒక కారణమైతే... ఇది పవిత్ర కార్తీక మాసం కావడం మరో కారణం. ఆ తరువాత ఈ నెల 26, 29, 30 తేదీల్లో మాత్రమే మంచి ముహూర్తాలు ఉన్నాయి.
-భానుమూర్తి, తెలంగాణ
అర్చక సంఘ అధ్యక్షులు