నేడు సగం సిటీకి నీరు బంద్
♦ ఆదివారం కొన్ని ప్రాంతాలకు...
♦ సోమవారం నాటికి పునరుద్ధరణ
♦ సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లకూ కష్టమే
♦ సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూమ్
సాక్షి, సిటీబ్యూరో : కృష్ణా మూడో దశ ట్రయల్న్‌ల్రో భాగంగా సుమారు 45 మిలియన్ గ్యాలన్ల జలాలను ఫేజ్-1, 2 పైప్‌లైన్ల ద్వారా నగరం నలుమూలలకు సరఫరాచేయనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం నగరంలోని వివిధ ప్రాంతాలకు 180 ఎంజీడీల కృష్ణా జలాల సరఫరా నిలిచిపోనుంది. దీంతో సగం సిటీకి నీరందే పరిస్థితి లేదు.ఆదివారం కూడా కొన్ని ప్రాంతాలకు నీటి సరఫరా ఉండదని జలమండలి ప్రకటించింది.
సోమవారం సరఫరాను పునరుద్ధరిస్తామని తెలిపింది. ట్రయల్న్‌ల్రో భాగంగా నల్లగొండ జల్లాలోని అక్కంపల్లి జలాశయంలో నీటిని తొలగించి... మూడోదశకు అవసరమైన పైప్‌లైన్‌ను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. రింగ్‌మెయిన్-1 పనులు 6.5 కి.మీ. మేర పూర్తి కానందున ఫేజ్-1, ఫేజ్-2 పైప్‌లైన్లను వాడుకోవడం అనివార్యమవుతోందని తెలిపింది. మరో మూడు నెలల్లో ఫిల్టర్‌బెడ్లు, రిజర్వాయర్లు, పైప్‌లైన్ పనులను పూర్తి చేసి నగరానికి 90 ఎంజీడీల నీటిని తరలిస్తామని జలమండలి మేనేజింగ్ డెరైక్టర్ ఎం.జగదీశ్వర్ తెలిపారు.
శనివారం ఏం చేస్తారంటే...
♦ అక్కంపల్లి జలాశయంలో హెడ్ రెగ్యులేటర్ తెరచి ప్రస్తుతం నిల్వ ఉన్న నీటిని కిందకు వదులుతారు.
♦ నీటి నిల్వలు తగ్గిన తరువాత కృష్ణా ఫేజ్-1, 2 మోటార్లను ఉదయం 4- 5 గంటల మధ్యఆపేస్తారు.
♦ ఉదయం 6 గంటలకు అక్కంపల్లిలో కాపర్ బండ్ ఉంచి... మూడో దశకు అవసరమైన పైప్‌లైన్ ఏర్పాటు చేస్తారు.
♦ సాయంత్రం 4 గంటలకు జలాశయాన్ని నీటితో నింపుతారు.
♦ సాయంత్రం 5 గంటలకు మూడో దశలో ఏర్పాటు చేసిన రెండు పంపులను ప్రారంభించి...పరీక్షిస్తారు.
♦ రాత్రి 9 గంటలకు అక్కంపల్లి నుంచి నగర శివార్లలోని సాహెబ్‌నగర్ (సుమారు 108 కి.మీ)కు 45 ఎంజీడీల నీటిని తరలించి.. మార్గమధ్యలో నూతన రిజర్వాయర్లు, వాల్వ్‌లు, జంక్షన్ల వద్ద లీకేజీలను పరీక్షిస్తారు.
♦ ఈ నీటిని అర్థరాత్రికి కృష్ణా మొదటి, రెండో దశ పైప్‌లైన్ల ద్వారా నగరం నలుమూలల్లోని రిజర్వాయర్లకు సరఫరా చేస్తారు.
రైల్వే స్టేషన్లలో ఇబ్బందే
నగరంలోని నాంపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లకు కూడా నీటి సరఫరా నిలిచిపోనుంది. దీంతో రైళ్లను శుభ్రపరచడం, నీటిని నింపుకునే పనులను వరంగల్, ఖాజీపేట్ తదితర స్టేషన్లలో పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. రైల్వే స్టేషన్లలో నీటి కొరత కారణంగా సుమారు 80కి పైగా ఎక్స్‌ప్రెస్, మరో వంద ప్యాసింజర్ రైళ్లలో ప్రయాణించే వేలాదిమంది తీవ్ర ఇబ్బందులు పడక తప్పని పరిస్థితి నెలకొంది. అయితే రైల్వే స్టేషన్లలోని ట్యాంకులలో నీటిని ముందుగానే నిల్వ చేసి పెట్టినట్లు ద.మ.రైల్వే అధికారులు తెలిపారు. నీటి సరఫరా పునరుద్ధరించే వరకు ప్రయాణికులు పొదుపుగా నీటిని వాడుకోవాలని విజ్ఞప్తి చేశారు.