
నేడు వరల్డ్ క్యాట్ డే
మ్యావ్.. మ్యావ్.. అంటూ అవి వంటింట్లో దూరితే ‘వామ్మో పాలు తాగేస్తుందేవ్’...
మ్యావ్.. వావ్!
మ్యావ్.. మ్యావ్.. అంటూ అవి వంటింట్లో దూరితే ‘వామ్మో పాలు తాగేస్తుందేవ్’... అంటూ కంగారు పడిపోయే రోజులు పోయి... ‘క్యాట్ యూ ఆర్ సో క్యూట్’ అంటూ ఇల్లంతా పిల్లికి దాసోహం చేసే రోజులు వచ్చేశాయి. వనాలను హరించిన కాంక్రీట్ జంగిల్‌లో కరువైన సహజీవన సౌందర్యం కోసం తహతహలాడుతున్న నగరవాసి మార్జాలాలను మనసారా అక్కున చేర్చుకుంటున్నాడు. ఈ ‘చిరు’ జీవులతో ఆడుతూ పాడుతూ ఆనందాన్ని పోగు చేసుకుంటున్నాడు. ఇప్పుడు పిల్లులంటే భయానికి, పిరికితనానికి కాదు... ప్రేమను పంచే పెట్స్‌కి గుర్తు. నేడు వరల్డ్ క్యాట్ డే సందర్భంగా వాటి సంరక్షణ, పెట్‌లవర్స్ మాట ఇతర అంశాలపై కథనం.
క్యాట్ కల్చర్ పెరిగింది
బయటకు వెళ్లేటప్పుడు పిల్లి ఎదురొస్తే అపశకునం, ఉదయాన్నే పిల్లి మొహం చూడొద్దనే నమ్మకాలు తగ్గాయి. చాలామంది ఇళ్లలో పిల్లులను పెంచుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. శుభ్రంగా ఉండటం, వాటిని పెంచుకోవడంలో ఇబ్బందులు లేకపోవడం కూడా ఓ కారణం. సిటీలో ఒత్తుగా జుత్తున్న పర్షియన్ పిల్లులను పెంచుకునేందుకు ఇష్టపడుతున్నారు. వీటికి గ్రూమ్ చెయ్యటం చాలా ముఖ్యం. రెగ్యులర్ గ్రూమ్ చెయ్యటం వల్ల బయో-డెర్మా ఇబ్బందులను అధిగమించవచ్చు.
- డాక్టర్ మురళీధర్
క్వైట్.. క్యూట్..
నా క్యాట్ నన్నే బాగా చూసుకుంటుంది. పొద్దున్నే వచ్చి ఆఫీసు టైంకు నిద్రలేపుతుంది. 15 ఏళ్ల నుంచి క్యాట్స్‌ని పెంచుకుంటున్నాను. ప్రస్తుతం ఉన్న పిల్లి పేరు ఫియోనా. మనం చూపించే కేర్‌ని బట్టి వాటి ప్రవర్తన ఉంటుంది. ఇవి కోజీగా ఉంటాయి. ఆడుతాయి... ముద్దుచేస్తాయి. న్యూసెన్స్ క్రియేట్ చెయ్యవు. హైజీన్‌గా ఉంటాయి. ఆహారం వేళకి పెడితే చాలు. ప్రత్యేక శిక్షణ అవసరం లేదు.
- కిమ్ థామస్, డీజే
పిల్లుల సంరక్షణ...
పిల్లులు మాంసాహారాన్నే తింటుంటాయి. బయట దొరికే కమర్షియల్ ఫుడ్స్‌లో వాటికి కావాల్సినమాంసాహారం, ప్రొటీన్, మినరల్స్ అన్నీ సరైన మోతాదుల్లో మిక్స్ చేసి తయారు చేస్తారు. కమర్షియల్ ఫుడ్‌లో వాటికి స్నాక్స్, మీల్స్ అన్ని రకాల ఫుడ్ ఇప్పుడు మార్కెట్‌లో దొరుకుతున్నాయి.
ఇంటి ఆహారం అయితే నాన్‌వెజ్ ఎక్కువ, తక్కువ రైస్‌తో ఫుడ్ పెట్టాలి. పిల్లి బరువుని బట్టి ఫుడ్ క్వాంటిటీ ఇవ్వాల్సి ఉంటుంది.ఇక చాలా మంది డ్రైఫ్రూట్స్ ఎక్కువగా ఆహారంగా ఇస్తుంటారు. దానికన్నా తాజా పళ్లతో కలిపి తగిన మోతాదులో మాత్రమే ఇవ్వటం మంచిది.
వ్యాక్సినేషన్..
పిల్లులకు కూడా రేబిస్ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలి.
పిల్లుల్లో 5 రకాల మేజర్ వైరల్ డిసీజెస్ వస్తుంటాయి.
వాటన్నింటికీ వ్యాక్సిన్స్ ఉన్నాయి. అవి కూడా తప్పనిసరిగా ఇప్పించాలి.
రోగ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
జాగ్రత్తగా చూసుకుంటే పిల్లి 15 ఏళ్లు వరకు బతుకుతుంది.
ఇదీ సంగతి
2002 నుంచి ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ యానిమల్ వెల్ఫేర్ (ఐఎఫ్‌ఏడబ్ల్యూ) ఆగస్ట్ 8న వరల్డ్ క్యాట్ డేగా పరిగణించటం మొదలైంది.మనతో పాటు 9,500 ఏళ్లుగా సహజీవనం చేస్తున్న పిల్లులు ప్రపంచంలోనే పాపులర్ పెట్. పిల్లులను పెంచుకోవటం వల్ల ఆందోళన, ఒత్తిడి తగ్గించుకొని మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చనేది పరిశోధకుల మాట.