ట్రాఫిక్ పోలీసులకు మీరెంత బాకీ..?
ఆర్టీఏ రికార్డుల్లో ఉన్న చిరునామాలో మీరు ఎప్పుడూ ఉండకపోవచ్చు. దీంతో మీ వాహనానికి సంబంధించి ట్రాఫిక్ ఉల్లంఘనలపై జారీ అయిన ఈ - చలాన్ మీకు చేరకపోవచ్చు. ఇలా పెండింగ్ చలాన్లు పెరిగి ట్రాఫిక్ పోలీసులకు చిక్కడమో.. న్యాయస్థానానికి వెళ్లాల్సిన పరిస్థితి రావడమో జరగొచ్చు. దీనికి పరిష్కారమే ‘ట్రాఫిక్ ఈ-చలాన్ తెలంగాణ’ యాప్. మీకెన్ని చలాన్‌లున్నాయో తెలుసుకోవాలంటే మీ మొబైల్‌లో ఈ యాప్‌ని డౌన్ లోడ్ చేసుకోండి.
- శ్రీరంగం కామేష్
నో రిజిస్ట్రేషన్..
ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత నేరుగా ఓపెన్ చేసుకోవచ్చు. ఇతర యాప్స్ మాదిరిగా ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. యాప్‌లోకి ప్రవేశించగానే ‘ఎంటర్ వెహికిల్ నంబర్’ ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో మీ వాహనం నంబర్ ఎంటర్ చేస్తే మీ పెండింగ్ ఈ-చలాన్ల వివరాలు డిస్‌ప్లే అవుతాయి. ‘వైలేషన్’ అనే కాలమ్‌లో ఉన్న మార్కు నొక్కితే ఎంత చెల్లించాలి తదితర పూర్తి వివరాలు ఫొటోతో సహా కనిపిస్తాయి.
మీ వాహనం నంబర్ ఎంటర్ చేసేటప్పుడు కచ్చితంగా క్యాపిటల్ లెటర్స్ ఉండేలా చూసుకోవాలి.
నెట్ బ్యాంకింగ్ సౌకర్యం...
అప్పటికప్పుడు యాప్ ద్వారా చెల్లింపులు చేయడానికి నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఇక్కడ మాత్రం సెల్‌ఫోన్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ నమోదు చేయాలి. తర్వాత చలాన్‌ను సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తే ‘మేక్ పేమెంట్’ ఆప్షన్ వస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోగానే నేరుగా నెట్ బ్యాంకింగ్‌కు కనెక్ట్ అవుతుంది. ప్రస్తుతం 32 బ్యాంకులతో ట్రాఫిక్ పోలీసు విభాగానికి ఒప్పందం ఉంది.
డౌన్‌లోడ్ ఇలా..
గూగుల్ ప్లేస్టోర్‌లో ‘ట్రాఫిక్ ఈ-చలాన్ తెలంగాణ’ అని టైప్ చేసి యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ పేరుతో సారూప్యత కలిగిన యాప్స్ మరికొన్ని ఉంటాయి. కచ్చితంగా (Traffic EChallan Telangana)నే డౌన్‌లోడ్ చేసుకోవాలి.