సూపర్ యాప్ | Super App | Sakshi
Sakshi News home page

సూపర్ యాప్

Published Wed, Oct 14 2015 12:26 AM | Last Updated on Mon, Aug 20 2018 2:35 PM

సూపర్ యాప్ - Sakshi

సూపర్ యాప్

రాకేష్ జూబ్లీహిల్స్ నుంచి నాంపల్లి వెళ్లాలనుకున్నాడు. తాను ఉన్నచోటు నుంచి చేరాలనుకున్న ప్రదేశం ఎంత దూరమో... ఆటో చార్జీ ఎంతవుతుందో తెలీదు. వెంటనే తన జేబులోని స్మార్ట్ ఫోన్‌లో చూశాడు. దూరం...ఆటోచార్జీ సుమారుగా ఎంతవుతాయో క్షణాల్లో స్క్రీన్‌పై ప్రత్యక్షమయ్యాయి.
 
కిరణ్ తన కారులో అమీర్‌పేట్ వెళ్లాడు. బయట వాహనాన్ని పార్కు చేసి... ఓ కాంప్లెక్స్‌లోకి షాపింగ్‌కు వెళ్లాడు. బయటకు వచ్చేసరికి కారు కనిపించలేదు. వెంటనే తన స్మార్ట్ ఫోన్ తీసి...చెక్ చేశాడు. నో పార్కింగ్ జోన్‌లో పెట్టినందుకు ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని తీసుకెళ్లినట్టు గుర్తించాడు... ఇదీ ట్రాఫిక్ పోలీసులు నూతనంగాఆవిష్కరించిన ‘యాప్’ ప్రత్యేకత. ఇదే తరహాలో మొత్తం తొమ్మిది రకాల సేవలను ఈ యాప్ అందిస్తుంది.
 
సిటీబ్యూరో: నగర ట్రాఫిక్ విభాగం అధికారులు కొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆటో చార్జీల నుంచి టోవింగ్ చేసినవాహనాల వివరాల వరకు అనేక అంశాలను ఇందులో పొందుపరిచారు. మంగళవారం కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్వాల్ ఎం.మహేందర్‌రెడ్డి దీన్ని ఆవిష్కరించారు. సమాచారం నుంచి సలహాలు, సూచనలు, ఫిర్యాదుల వరకు మొత్తం తొమ్మిది రకాల సేవలు ఇందులో అందుబాటులో ఉన్నాయి. గూగుల్ ప్లేస్టోర్స్‌లో (ఏ్గఈఉఖఅఆఅఈ ఖీఖఅఊఊఐఇ ఔఐగఉ) పేరుతో ఉందని.. స్మార్ట్ ఫోన్ వినియోగదారులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ట్రాఫిక్ విభాగం అదనపు పోలీసు కమిషనర్ జితేందర్ ప్రకటించారు. జీపీఎస్ ఆధారంగా పని చేసే ఈ యాప్‌లో ఉండే సౌకర్యాలివీ...

ప్రజలతో ముఖాముఖి...
ఈ విభాగం ద్వారా సెల్‌ఫోన్ నుంచే మీకు కనిపించిన ఉల్లంఘన, మీరు చేయదలచిన ఫిర్యాదు, సూచనలను ట్రాఫిక్ పోలీసుల దృష్టికి తీసుకువెళ్లవచ్చు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు, నేరాలతో పాటు పోలీసులు చేసే ఉల్లంఘనలు, సూచనలనూ ఫీడ్ చేయవచ్చు.

ఆటో కిరాయి అంచనా...
ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఆటో చార్జీలు తెలుసుకోవడానికి ఈ విభాగం ఉపకరిస్తుంది. మీరున్న ప్రాంతాన్ని జీపీఎస్ ద్వారా దానంతటదే గుర్తిస్తుంది. మీరు చేరుకోవాల్సిన ప్రాంతాన్ని టైప్ చేస్తే చాలు... దూరం, చార్జీ (పగలు/రాత్రి సైతం) వివరాలు తెలుస్తాయి.
 
ప్రస్తుత ట్రాఫిక్ పరిస్థితి...
 వివిధ మార్గాల్లో ట్రాఫిక్ సరళి గరిష్టంగా ఓ నిమిషం ఆలస్యంగా ఇందులో అప్‌డేట్ అవుతూ ఉంటుంది. ట్రాఫిక్ రద్దీని చెప్పడంతో పాటు సమీపంలో ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను సైతం ఇది సూచిస్తుంది. గమ్య స్థానం దూరం, మ్యాప్‌లు కనిపిస్తాయి.
 
సమీప పోలీసు స్టేషన్...
 ఓ వ్యక్తి తాను ఉన్న ప్రాంతం నుంచి సమీపంలో ఉన్న శాంతిభద్రతల విభాగం, ట్రాఫిక్ పోలీసు స్టేషన్ల వివరాలు తెలుసుకోవడానికి ఇది ఉపకరిస్తుంది. జీపీఎస్ పరిజ్ఞానంతో పని చేసే ఈ విభాగంలో వివిధ రంగుల్లో సమీపంలోని పోలీసు స్టేషన్లు కనిపిస్తాయి.
 
ఈ-చలాన్ స్థితి...

 మీ వాహనంపై ఉన్న పెండింగ్ ఈ-చలాన్లు తెలుసుకోవడానికి పనికి వచ్చే విభాగమిది. దీని ద్వారానే మొబైల్ బ్యాంకింగ్, మొబైల్ యాప్‌లకు కనెక్ట్ అవడంతో పాటు బకాయి మొత్తాన్ని అప్పటికప్పుడే చెల్లించే సౌకర్యమూ ఉంది.

టోవ్డ్ వాహనం వివరాలకు...
 నో పార్కింగ్‌లో పెట్టిన, అనుమతిలేని ప్రాంతాల్లో నిలిపిన వాహనాలను పోలీసులు క్రేన్ ద్వారా ఎత్తుకెళితే (టోవింగ్) ఆ విషయం తెలుసుకోవడానికి ఠాణాకు వెళ్లక్కర్లేదు. ఈ విభాగంలో మీ వాహనం నెంబర్ ఎంటర్ చేస్తే చాలు... ఏ పోలీసులు, ఎక్కడి నుంచి, ఎన్ని గంటలకు టోవింగ్ చేశారనే వివరాలు కాంటాక్ట్ నెంబర్‌తో సహా కనిపిస్తాయి.

వాహనం ఆర్టీఏ వివరాలు...
 మీ వాహనాన్ని ఎవరికైనా అమ్మితే తక్షణం ఓనర్‌షిప్ ట్రాన్స్‌ఫర్ ద్వారా రిజిస్ట్రేషన్ మార్చుకోవాల్సి ఉంటు ంది. గతంలో మీరు అమ్మిన వాహనాలు అలా మారా యో లేదో తెలుసుకోవడానికి ఇది ఉపకరిస్తుంది.
 
ప్రజల ఇన్ఫర్మేషన్...
 రహదారి నిబంధనలు, ఉపయుక్తమైన వెబ్‌సైట్లు, రోడ్ సైన్స్, ట్రాఫిక్ పోలీసు అధికారుల సమాచారం ఇందులో లభిస్తాయి. అదనపు పోలీసు కమిషనర్ నుంచి క్షేత్ర స్థాయి అధికారుల వరకు ప్రతి ఒక్కరి కాంటాక్ట్ వివరాలు ఉంటాయి.
 
ఆటోలపై ఫిర్యాదులకు....

ఆటో, బస్సు, క్యాబ్, ట్యాక్సీ తదితర వాహనాలకు సంబంధించి ‘తిరస్కరణ’ సహా అన్ని ఉల్లంఘనలనూ దీని ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ‘సబ్మిట్’ చేసిన నిమిషం లోపే మీకు కంట్రోల్ రూమ్ నుంచి ఫోన్ వస్తుంది. గరిష్టంగా 10 నిమిషాల్లో సిబ్బందీ అందుబాటులోకి వచ్చి సమస్య పరిష్కరిస్తారు.
 
 తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో
 ఈ యాప్‌లో తెలుగు, ఇంగ్లీషు భాషల్లో వివరాలు ఉంటాయి. ప్రజలు తమకు సౌలభ్యమైనది ఎంచుకోచ్చు. ప్రస్తుతం ఈ యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులు కంట్రోల్‌రూమ్ నుంచి క్షేత్ర స్థాయిలో ఉండే ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు చేరుతాయి. అలాంటి అవసరం లేకుండా జియో ట్యాగిం గ్ ద్వారా నేరుగా సమీపంలో ఉన్న  క్షేత్రస్థాయి సిబ్బందికి చేరేలా ఏర్పాటు చేస్తున్నాం.     - జితేందర్, ట్రాఫిక్ చీఫ్
 
 సిటిజన్ ఫ్రెండ్లీలో మరో ముందడుగు
 ఈ యాప్ ద్వారా ట్రాఫిక్ పోలీసులు సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో మరో ముందడుగు వేశారు. వేర్వేరు యాప్‌లు కాకుండా అన్ని సేవలకూ ఒకటే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. రోడ్డు మీదికి వచ్చిన వాహన చోదకుడికి సెల్‌ఫోన్ టెక్నాలజీయే అందుబాటులో ఉంటుంది. అలాంటి వారికి యాప్స్ ఎంతో ఉపయుక్తం.
 - మహేందర్‌రెడ్డి, కొత్వాల్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement