
మృత్యు గేట్లు
నగరంలోని వివిధ మార్గాల ద్వారా నిత్యం వందలాది రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రధాన రహదారుల్లో రైల్వే గేట్లు ఉన్నాయి. అక్కడ గంటల కొద్దీ ట్రాఫిక్ జాం అవుతోంది. గేటు దాటాలనే ఆత్రుతతో ప్రజలు ప్రమాదాలకు గురవతూ ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో నగరంలో రోడ్ అండర్ బిడ్జ్రి (ఆర్‌యూబీ),రోడ్ ఓవర్ బ్రిడ్జి (ఆర్‌వోబీ) నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైల్వే, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, ఆర్‌అండ్‌బీ అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా ఏళ్ల తరబడి నిర్మాణాలు సాగుతూనే ఉన్నాయి. కొన్ని వంతెనల నిర్మాణాలు ఫైళ్లకే పరిమిత మయ్యాయి. నగరంలో దాదాపు 15 వంతెనలు నిర్మాణంలో ఉన్నాయి. ఇవి పూర్తయితే ప్రజల కష్టాలు కొంత మేరకు తీరే అవకాశం ఉంది.
ఉప్పుగూడలో నరకమే..
ఇక్కడ ట్రాఫిక్ జామ్‌లతో నిత్యం నరకాన్ని చ విచూస్తున్నారు. ఈ ప్రాంతంలో రెండు లైన్ల ఆర్‌వోబీ నిర్మాణానికి తొలుత అంచనాలు రూపొందించారు. అప్రోచ్ రోడ్లతో సహా రూ. 19.58 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. పనులు ప్రారంభమయ్యే సమయంలో స్థానిక నేతలు, ప్రజల విజ్ఞప్తి మేరకు ఆర్‌వోబీని ఆర్‌యూబీగా మార్చారు. ఈ మార్పుతో రైల్వే నుంచి అదనపు భూసేకరణ అవసరమైంది. పనులు పెండింగ్‌లో పడ్డాయి. ఏళ్లు గడుస్తున్నా పనులు ప్రారంభం కాలేదు.. ఉప్పుగూడ, కందికల్ రైల్వేగేట్ల నిర్మాణ పనులకు ఒకేసారి శంకుస్థాప న చేసినప్పటికీ, రెండు బ్రిడ్జిల నిర్మాణం ఒకే సారి చేపడి తే ఇబ్బందులు ఎదురవుతాయన్న జాగ్రత్తతో అధికారులు కందికల్ ఆర్‌వోబీ పూర్తయిన అనంతరం ఉప్పుగూడ రైల్వేబ్రిడ్జిని నిర్మించేందుకు నిర్ణయించారు. ఐదు నిమిషాలకోమారు పడుతున్న ఈ గేట్‌తో వాహనదారులు నరకయాతను అనుభవిస్తున్నారు.
అనుమతి ఎప్పుడో...
తుకారాం గేట్ వద్ద రూ. 10 కోట్ల అంచనా వ్యయంతో ఆర్‌యూబీ నిర్మాణం చేపట్టాలని తొలుత ప్రతిపాదనలు చేశారు. దీనికి సంబంధించి రైల్వే వర్గాల మార్గదర్శకాలు మారడంతో.. అందుకనుగుణంగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక ( డీపీఆర్‌ను) రూపొందించాల్సి ఉంది. భవిష్యత్‌లో ట్రాఫిక్ పెరగనుండడంతో రెండు లైన్ల స్థానంలో నాలుగలైన్లున్న ఆర్‌యూబీకి ఫీజుబిలిటీ నివేదిక నివ్వాల్సిందిగా కన్సల్టెంట్‌ను కోరారు. ప్రస్తుత ం ఆ పని జరుగుతోంది. అది పూర్తయ్యాక, రైల్వేశాఖ నుంచి అనుమతి పొందాల్సి ఉంది. ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితి. అంచనా వ్యయం రూ. 14.2 కోట్లకు పెరిగింది.
కందికల్ గేట్ వద్దా అదే తంతు..
కందికల్ గే ట్ వద్ద ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఆర్‌వోబీ నిర్మించాలని నిర్ణయించారు. బ్రిడ్జి నిర్మాణాన్ని రైల్వే శాఖ, అప్రోచ్ మార్గాలను జీహెచ్‌ఎంసీ నిర్మించాలన్నది తొలి ప్రతిపాదన. అప్రోచ్‌ల నిర్మాణానికి రూ. 23.47 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అప్రోచ్ మార్గాల పనులు ఇంకా పూర్తికాకపోవడంతో అందుబాటులోకి రాలేదు. ఆర్‌వోబీకి చెందిన 33 పిల్లర్లకు గాను 32 పిల్లర్లు పూర్తయ్యాయి. 33 శ్లాబులకు గాను 14 శ్లాబుల పనులే జరిగాయి. డిసెంబర్ నాటికి పనులు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు.
ప్రారంభం కాని పనులు
నేరేడ్‌మెట్: వాజ్‌పేయినగర్ రైల్వే గేటు వాహనదారుల పాలిట శాపంగా మారింది. తరుచూ రైల్వే గేట్ పడుతుండడంతో ప్రజల అవస్థలు వర్ణణాతీతం. మల్కాజ్‌గిరి, ఆనంద్‌బాగ్, వినాయక్‌నగర్, సఫిల్‌గూడ తదితర ప్రాంతాల ప్రజలు నేరేడ్‌మెట్‌కు ఈ గేటు మీదుగా వెళ్లాలి. ఇక్కడ గేటు పడితే కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. ఆర్‌యూబీ నిర్మాణం చేస్తున్నామని అధికారులు చెప్పినా ఇంతవరకూ పనులు ప్రారంభం కాలేదు.
సా..గుతున్నాయి..
బేగంపేట ఆర్‌వోబీ- ఫతేనగర్ లింక్‌రోడ్డు మార్గం పనులు ఏడేళ్లుగా సాగుతున్నాయి. ఆర్‌వోబీ పూర్తయినా, లింక్‌రోడ్డు పూర్తి కాకపోవడంతో అందుబాటులోకి రాలేదు. ఇది పూర్తయితే బాలానగర్ నుంచి సికింద్రాబాద్ మార్గంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి. పనులు దాదాపు పూర్తి కావచ్చాయని, త్వరలోనే ప్రారంభోత్సవం చేస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టు వ్యయం రూ. 13.5 కోట్లు.
మోక్షం ఎప్పుడో..
►సఫిల్‌గూడ రైలు మార్గంలో రోడ్ అండర్ బ్రిడ్జి నిర్మాణానికి 2001-02 బడ్జెట్‌లోనే రైల్వేబోర్డు అనుమతినిచ్చింది. ఈ బ్రిడ్జి నిర్మాణానికి రూ. 32.89 కోట్లతో అంచనాలు చేశారు. ప్రతిపాదనలు మారడంతో పనులు ప్రారంభం కాలేదు.
►జీహెచ్‌ఎంసీ సూచన మేరకు ఉప్పుగూడ-యాఖుత్‌పురా మార్గంలో నిర్మించతలపెట్టిన రోడ్ ఓవర్ బ్రిడ్జిని రోడ్ అండర్ బ్రిడ్జిగా మార్పు చేశారు. రూ.10.84 కోట్లతో ప్రణాళికలు రూపొందించారు. పనులు ప్రారంభం కావాల్సి ఉంది.
►రైల్‌నిలయం వద్ద రూ. 10.80 కోట్లతో చేపట్టిన ఆర్‌యూబీ నిర్మాణానికి సంబంధించి డ్రైనేజీ , ఆప్రోచ్ పనులు పూర్తికాలేదు.
►ఆలుగడ్డ బావి వద్ద ఆర్‌యూబీకి సైతం అప్రోచ్ మార్గాలు, డ్రైనేజీ పనులు పూర్తికాలేదు. అంచనా వ్యయం రూ. 17.93 కోట్లు.
►సంజీవయ్య పార్కు వద్ద ఆర్‌యూబీ పనులకు హెచ్‌ఎండీఏ వాటా నిధులందాల్సి ఉండడంతో పనులు పెండింగ్‌లో పడ్డాయి. అంచనా వ్యయం రూ. 14.7 కోట్లు.
►ఆనంద్‌బాగ్ వద్ద ఆర్‌యూబీ పనులు టెండరు దశలో ఉన్నాయి. అంచనా వ్యయం రూ. 21.13 కోట్లు.
►నేరెడ్‌మెట్ వద్ద రూ. 21.13 కోట్ల అంచనా వ్యయంతో ఆర్ యూబీ నిర్మాణానికి ప్రతిపాదించారు. టెండరు దశలో ఉంది.
►హైటెక్ సిటీ ఎంఎంటీఎస్ వద్ద నాలుగులేన్ల ఆర్‌యూబీ నిర్మించాలని భావించారు. అక్కడున్న మంజీరా పైపులైన్ల కారణంగా ఆర్‌వోబీ, ఆర్‌యూబీల నిర్మాణం సాధ్యం కాదని తేల్చారు.
►కై త్లాపూర్ వద్ద ఆర్‌యూబీ నిర్మాణానికి ప్రతిపాదించారు. నిర్మాణ వ్యయం అంచనాలను రైల్వేశాఖకు పంపించాల్సి ఉంది.
► ఫలక్‌నుమా, శాస్త్రిపురంల వద్ద ఎల్‌సీ నెం. 7 వద్ద గ్రేడ్ సెపరేటర్‌కు ఫీజుబిలిటీ సర్వే నిర్వహించారు. నివేదికను రైల్వే శాఖకు పంపించారు.
►రాణిగంజ్ దగ్గరి ఆర్‌యూబీని కర్బలా మైదాన్ వరకు పొడిగించాలనే ప్రతిపాదనలున్నాయి. అంచనా వ్యయం రూ. 29 కోట్లు.