షెడ్యూలు విడుదల... నేడు నోటిఫికేషన్ జారీ
► ఈనెల 15 నుంచి 30 వరకు ఫీజు చెల్లింపు గడువు
► 16 నుంచి 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
► పరీక్ష నిర్వహణపై అభ్యర్థుల్లో ఇంకా అనుమానాలు
సాక్షి, హైదరాబాద్:
రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ను మే 1న నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందుకోసం ఆదివారం తాజాగా నోటిఫికేషన్ జారీ చేయనుంది. అభ్యర్థులు ఈ నెల 15 నుంచి 30 వరకు టీఎస్ ఆన్‌లైన్ లేదా పేమెంట్ గేట్ వే ద్వారా ఫీజు చెల్లించవచ్చని వెల్లడించింది. అలాగే ఈనెల 16 నుంచి 31వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో (http://tstet.cgg.gov.in) దరఖాస్తులను సమర్పించవచ్చని పేర్కొంది. శనివారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో చర్చించిన అనంతరం విద్యాశాఖ ఈ మేరకు షెడ్యూలును జారీ చేసింది.
ఈసారైనా పరీక్ష జరిగేనా?
టెట్‌ను నిర్వహించేందుకు విద్యాశాఖ ఇప్పటికే రెండుసార్లు నోటిఫికేషన్ జారీ చేసి షెడ్యూలును ప్రకటించినా వివిధ కారణాలతో వాయిదా వేసింది. తాజాగా మళ్లీ నోటిఫికేషన్ జారీకి సిద్ధమై షెడ్యూలును ప్రకటించింది. అయితే ఈసారైనా పరీక్ష నిర్వహిస్తారా అనే ఆందోళన అభ్యర్థుల్లో నెలకొంది. ప్రభుత్వం తొలుత గతేడాది నవంబర్ 14న టెట్ నోటిఫికేషన్ జారీ చేసి జనవరి 24న పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే అప్పట్లో వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆమోదం కోసం రాయడంతో ఆగిపోయింది. ఆ తరువాత నుంచి వివిధ కారణాలతో దరఖాస్తుల స్వీకరణ వాయిదా పడుతూ వచ్చింది. గత నెల 27న మరోసారి టెట్ నిర్వహణకు విద్యాశాఖ షెడ్యూలు జారీ చేసింది. ఏప్రిల్ 9న టెట్ నిర్వహిస్తామని, ఫిబ్రవరి 29 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని పేర్కొంది. అయితే టెట్ నిర్వహణ విషయంలో సమస్యలు ఉన్నాయని, వాటిని పరిశీలించి తగిన చర్యలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 5న కమిటీని వేసిందన్న అంశాన్ని పేర్కొంటూ దరఖాస్తుల స్వీకరణను మరోసారి వాయిదా వేసింది.
కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం సెంట్రల్ టెట్‌ను ఫిబ్రవరి 21న యథావిధిగా నిర్వహించింది. తాజాగా మూడోసారి టెట్ నిర్వహణకు అధికారులు షెడ్యూలు జారీ చేయడంతో అభ్యర్థుల్లో సంతోషం వ్యక్తమవుతున్నా.. పరీక్ష జరుగుతుందా అనే ఆందోళన మాత్రం వారిని ఇంకా వెంటాడుతోంది. రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాల్సిందేనని సుప్రీంకోర్టు గతంలోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం తెలిసిందే. అందుకు సంబంధించిన కేసు త్వరలో విచారణకు రానున్న నేపథ్యంలో టెట్, ఆ తరువాత డీఎస్సీ నిర్వహిస్తామని సుప్రీంకోర్టుకు చెప్పుకునేందుకే ప్రభుత్వం టెట్ షెడ్యూలు జారీ చేసిందా అనే ప్రశ్నలు అభ్యర్థుల్లో తలెత్తుతున్నాయి. ఏదేమైనా ఈసారైనా పరీక్షను కచ్చితంగా నిర్వహించాలని వారు కోరుతున్నారు.
డీఎస్సీపై పరిశీలన
టెట్ షెడ్యూల్ జారీ అయిన నేపథ్యంలో డీఎస్సీ నిర్వహిణను కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి. డీఎస్సీకి సంబంధించి మరికొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని వెల్లడించాయి.
ఇదీ టెట్ షెడ్యూలు
13-3-2016: టెట్ నోటిఫికేషన్
15-3-2016 నుంచి 30-3-2016 వరకు: టీఎస్ ఆన్‌లైన్, పేమెంట్ గేట్ ద్వారా ఫీజు చెల్లింపు.
15-3-2016 నుంచి: వెబ్‌సైట్ ద్వారా టెట్ సమాచార బులెటిన్, పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
16-3-2016 నుంచి 31-3-2016 వరకు: ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సమర్పణ.
15-3-2016 నుంచి 1-5-2016 వరకు: అందుబాటులోకి హెల్ప్ డెస్క్ సేవలు.
15-3-2016 నుంచి 31-3-2016 వరకు: ఆన్‌లైన్ దరఖాస్తులకు సంబంధించిన ఫిర్యాదుల స్వీకరణ
20-4-2016 నుంచి: హాల్ టికెట్ల డౌన్‌లోడ్
1-5-2016: టెట్ పరీక్ష (ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపరు-1 పరీక్ష, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపరు-2 పరీక్ష)
మే 1న టెట్
Published Sun, Mar 13 2016 1:24 AM | Last Updated on Sun, Sep 3 2017 7:35 PM
Advertisement