హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల సమస్యలపై కేసీఆర్ సర్కార్ అనుసరిస్తున్న వైఖరిపై టీ టీడీపీ నేతలు ఎల్.రమణ, ఎర్రబెల్లి దయాకరరావు, రావుల చంద్రశేఖరరెడ్డి గురువారం హైదరాబాద్లో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రుణాలు మాఫీ కాక, వ్యవసాయం గిట్టుబాటు కాక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా... కేసీఆర్ ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యాన్ని వీడటం లేదని వారు ఆరోపించారు.
రైతులను ఈ ప్రభుత్వం దగా చేస్తోందన్నారు. రైతు కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని చెబుతున్న కేసీఆర్... పేదల ఇళ్లు నిర్మాణాల బిల్లులను పెండింగ్లో పెట్టడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు.
ఏడాదిగా బిల్లులు చెల్లించకపోవడంతో పేదలు అప్పుల బారిన పడుతున్నాని ఎర్రబెల్లి, రమణ, రావుల ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించాలనే డిమాండ్తో ఆగస్టు 5వ తేదీన వరంగల్లో దీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాల వారీగా ప్రజా సమస్యలపై దీక్షలు, ధర్నాలు నిర్వహిస్తామని ఎర్రబెల్లి, రమణ, రావుల స్పష్టం చేశారు.