- మరో రెండ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం
- పంట నష్టంపై అధికారులతో వ్యవసాయ మంత్రి సమీక్ష.. రబీకి సిద్ధంగా ఉండాలని ఆదేశం
- లక్షన్నర ఎకరాల్లో నీట మునిగిన పంటలు
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దాంతో శని, ఆదివారాల్లోనూ రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడా కుండపోత వాన పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు ఇప్పటికే భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. గురువారం ఉదయం 8.30 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8.30 వరకు వరంగల్ జిల్లా ధర్మాసాగర్‌లో అత్యధికంగా 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిశాయి.
హైదరాబాద్‌లో 442% అధిక వర్షపాతం
హైదరాబాద్ నగరంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతోంది. ఈ నెల ఒకటో తేదీ నుంచి 23వ తేదీ (శుక్రవారం) నాటికి సాధారణంగా 81.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... ఏకంగా 443.8 మిల్లీమీటర్లు (442% అదనం) కురిసింది. ఇదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 103.2 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా.. 150 శాతం అధికంగా 258.4 మిల్లీమీటర్లు నమోదైంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా చెరువులన్నీ నిండిపోయాయి.
లక్షన్నర ఎకరాల్లో పంట నష్టం!
భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్షన్నర ఎకరాల్లో పంట నీట మునిగిందని వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనా వేసినట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఇంకా ధ్రువీకరించడం లేదు. పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి నష్టం అంచనా రూపొందించాల్సిం దిగా వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన శాఖ అధికారులతో ఆయన అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ వర్షాలు రబీ పంటలకు ప్రయోజనకరమని.. అందువల్ల అవసరమైన విత్తనాలు, ఎరువులను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఏమాత్రం ఆల స్యం కాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
స్థిరంగా అల్పపీడనం
Published Sat, Sep 24 2016 3:06 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement