కృష్ణా జలాల కోసం కలసి పోరాడాలి
కేసీఆర్, చంద్రబాబులకు సీపీఐ సూచన
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల విషయంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి తెలంగాణ, ఏపీలకు అన్యాయం జరగకుండా చూడాలని సీపీఐ డిమాండ్ చేసింది. గురువారం సీపీఐ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, ఏపీ కార్యదర్శి కె.రామకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ, ఇద్దరు సీఎంలు పంతాలు, పట్టింపులకు పోకుండా తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడేలా ముందుకు సాగాలన్నారు. కృష్ణా జలాలపై బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును వారు తప్పుబట్టారు.
సమగ్ర జలవిధానం రూపొందించాలి: చాడ
నదీ జలాల వినియోగంపై వివిధ రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తకుండా కేంద్రం సమగ్ర జల విధానాన్ని రూపొందించాలని చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. కృష్ణా జలాల విషయంలో బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ నదికి ఎగువన ఉన్న రాష్ట్రాలకు ఏ విధమైన నిబంధనలు పెట్టకుండా దిగువన ఉన్న రాష్ట్రాలకు షరతులు విధించడం అన్యాయమన్నారు. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై చంద్రబాబు వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.