తూర్పు గోదావరి జిల్లా తునిలో ఆదివారం జరిగే కాపు ఐక్య గర్జన ...రాజకీయ సభ కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు.
హైదరాబాద్ : తూర్పు గోదావరి జిల్లా తునిలో ఆదివారం జరిగే కాపు ఐక్య గర్జన ...రాజకీయ సభ కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ఆయన శనివారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ భవిష్యత్ తరాల భద్రత, ప్రయోజనాల కోసమే కాపు గర్జన సభ జరుగుతోందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో అసహనం వ్యక్తం చేశారని.. కాపు గర్జన వెనుక రాజకీయ పార్టీలు ఉన్నాయంటూ తమ పార్టీ పేరు పెట్టి అన్నందునే దానిపై తాము స్పందించాల్సిన వచ్చిందన్నారు.
కాపుల సంక్షేమం, రిజర్వేషన్లపై ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని చెబుతూ దాన్ని చెడగొట్టే ధోరణిలో వైఎస్ఆర్ సీపీ వ్యవహరిస్తున్నాయని చంద్రబాబు అనడం దురదృష్టకరమన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యలను ఉమ్మారెడ్డి ఖండించారు. పార్టీలకు అతీతంగా జరుగుతున్న కాపు గర్జనపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
కాపులను కించపరిచే విధంగా చంద్రబాబు వ్యాఖ్యలు చేశారని అన్నారు. వైఎస్ఆర్ సీపీ కాపులను రెచ్చగొడుతోందని సీఎం కార్యాలయం చేసిన ప్రకటన దుర్మార్గమన్నారు. ఆ వ్యాఖ్యలు సీఎం స్థాయికి తగని విధంగా ఉన్నాయన్నారు. తక్షణమే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఉమ్మారెడ్డి డిమాండ్ చేశారు. కాపుల్లో చిచ్చుపెట్టడానికి టీడీపీ యత్నిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.