అనుబంధ చార్జిషీట్ అంటూ ఏసీబీ సేఫ్‌గేమ్ | Undavalli Arunkumar Argument in the case of cote for the note | Sakshi
Sakshi News home page

అనుబంధ చార్జిషీట్ అంటూ ఏసీబీ సేఫ్‌గేమ్

Published Thu, Nov 17 2016 2:08 AM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM

అనుబంధ చార్జిషీట్ అంటూ ఏసీబీ సేఫ్‌గేమ్ - Sakshi

అనుబంధ చార్జిషీట్ అంటూ ఏసీబీ సేఫ్‌గేమ్

- ఓటుకు కోట్లు కేసులో ఉండవల్లి అరుణ్‌కుమార్ వాదన
- ఈ కేసు కోసం చంద్రబాబు ఏపీ ప్రయోజనాలను తాకట్టుపెట్టారు

 సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో అనుబంధ చార్జిషీట్ దాఖలు చేస్తామంటూ తెలంగాణ ఏసీబీ సేఫ్‌గేమ్ ఆడుతోందని న్యాయవాది ఉండవల్లి అరుణ్‌కుమార్ వివరించారు. ఈ కేసులో విసృ్తత ప్రజా ప్రయోజనాలు ఉన్నాయని, బాధ్యతాయుతమైన పౌరుడిగా వాస్తవాలను కోర్టు ముందుంచేందుకే ఈ కేసులో తన వాదనలను వినాలని హైకోర్టును కోరానని తెలిపారు. ఓటుకు కోట్లు కేసులో తన వాదనలు వినాలంటూ ఉండవల్లి అరుణకుమార్ అనుబంధ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో న్యాయమూర్తి జస్టిస్ సునీల్ చౌదరి బుధవారం ఈ కేసులో జోక్యం చేసుకునే అర్హతపై ఉండవల్లి వాదనలు కూడా విన్నారు. చంద్రబాబు గురించి ఏసీబీ తన చార్జిషీట్‌లో పలుమార్లు పేర్కొందని, అరుునప్పటికీ ఆయనను ఇప్పటివరకు ఒక్కసారి కూడా ప్రశ్నించలేదని ఉండవల్లి కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనిని బట్టి ఏసీబీ దర్యాప్తు ఏ కోణంలో సాగుతుందో సులభంగా అర్థం చేసుకోవచ్చునని తెలిపారు.

ప్రజా ప్రతినిధుల కేసుల్లో విచారణను సంవత్సరంలోపు పూర్తి చేయాలని లా కమిషన్ సిఫారసు చేసిందని, కానీ ఏసీబీ సంవత్సరాల తరబడి ఈ కేసును దర్యాప్తు చేస్తోందని తెలిపారు. ఈ కేసుతో తనకు సంబంధం లేదని కానీ, స్టీఫెన్‌సన్‌తో జరిగిన సంభాషణల్లోని స్వరం తనది కాదని కానీ చంద్రబాబు ఇప్పటివరకూ ఎక్కడా చెప్పలేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని 9,10 షెడ్యూళ్లలో ఉన్న ఆస్తుల విభజన ఇంతవరకు జరగలేదని, చంద్రబాబు ఏపీ ప్రజల ప్రయోజనాలను తాకట్టుపెట్టి ఓటుకు కోట్ల కేసు నుంచి బయటపడాలని చూస్తున్నారని వివరించారు. సీఆర్‌పీసీ సెక్షన్ 482 కింద హైకోర్టుకు స్వతఃసిద్ధ అధికారాలున్నాయని, వాటిని ఉపయోగించి తప్పును సరిచేసేందుకు తగిన ఉత్తర్వులు జారీ చేయవచ్చునన్నారు. తరువాత ఫిర్యాదుదారు ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి గతవారం నాటి తన వాదనలను మరోసారి పునరుద్ఘాటించారు. కోర్టు లేవనెత్తిన పలు సందేహాలను నివృత్తి చేశారు. చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూత్రా తిరుగు సమాధానం కోసం తదుపరి విచారణ గురువారానికి వారుుదా పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement