
ఫిల్మ్ నగర్‌లో దుర్ఘటన
హైదరాబాద్: నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలి ఇద్దరు కూలీలు మృతి చెందిన ఘటన హైదరాబాద్లోని ఫిల్మ్నగర్‌లో చోటు చేసుకుంది. కల్చరల్ క్లబ్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో మరో 12 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. నిర్మాణంలో ఉన్న భవనం పిల్లర్లు 10కి పైగా నేలమట్టం కావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పలువురు కూలీలు శిధిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గత ఇరవై రోజులుగా ఈ భవనానికి సంబంధించిన నిర్మాణ పనులు జరుగుతున్నట్లు సమాచారం. ప్రమాదంలో ఈ భవనానికి ఆనుకొని ఉన్న మరో బిల్డింగ్ సైతం పాక్షికంగా దెబ్బతింది.
ఫిల్మ్ నగర్ క్లబ్ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ నిర్మాణాలకు అనుమతులు లేవని జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ వెల్లడించారు. ఎన్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని ఆయన వెల్లడించారు. ఈ ప్రమాదంపై విచారణ జరుపుతున్నామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. గాయపడినవారిని అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులను ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి పరామర్శించారు. క్షతగాత్రులను సీతారాం, నర్సింహ, మహేంద్రప్ప, శివలింగప్ప, మల్లేష్, సిద్ధప్ప, హనుమంతు, కొండల్ రావు, మల్లిఖార్జునరావు, చెన్నయ్య, శ్రీను, కోటేష్లుగా గుర్తించారు.
నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం మూలంగానే ప్రమాదం జరిగిందని మేయర్ బొంతు రామ్మోహన్ స్పష్టం చేశారు. ఈ ప్రమాదానికి ఫిల్మ్ క్లబ్ అసోసియేషన్ సభ్యులు బాధ్యత వహించాలన్నారు. మొదటి ఫ్లోర్ వేసిన 24 గంటల్లోనే రెండో ఫ్లోర్ వేయడం ఈ ప్రమాదానికి కారణమైనట్లు ఆయన తెలిపారు. బిల్డింగ్ కాంట్రాక్టర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారి కుటుంబాలకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బిల్డింగ్ కూలిన ఘటనపై వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.