
మళ్లీ మీ కడుపునే పుడతా
నేను ఉండి ప్రయోజనం లేదు...ఏదీ సాధించలేక పోతున్నా...
హైదరాబాద్(చైతన్యపురి): ''నేను ఉండి ప్రయోజనం లేదు...ఏదీ సాధించలేక పోతున్నా...ఒకటిన్నరేళ్లుగా ఒక్క ఎగ్జామ్‌లో కూడా క్వాలిఫై కాలేదు...అంతా టైం వేస్టు...మనీ వేస్ట్.. అందుకే ఇక సెలవ్..ఇక్కడ నుంచి శాశ్వతంగా వెళ్లిపోతున్నా...'' టూ ఓ యువకుడు జీవితంపై విరక్తి చెంది ప్రైవేట్ హాస్టల్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ లింగయ్య తెలిపిన వివరాల ప్రకారం విజయనగరం జిల్లా శివరాంపూర్ గ్రామానికి చెందిన ప్రదీప్‌కుమార్(23) డిగ్రీ పూర్తి చేశాడు.
ఏడాదిన్నరగా పోటీపరీక్షలకు సిద్ధమవుతూ లలితానగర్‌లోని చిరంజీవి హాస్టల్‌లో ఉంటున్నాడు. అయితే ఏ ఒక్క పరీక్షలోనూ ఉత్తీర్ణత సాధించలేకపోవడంతో మనస్థాపానికి లోనైన అతను శుక్రవారం హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాస్టల్ నిర్వాహకుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. మళ్లీ జన్మ ఉంటే మీ కడుపునే పుడతా అంటూ తల్లిదండ్రులకు, అమ్మను..తమ్ముడిని బాగా చూసుకోమని బాబాయిని ఈ లేఖలో కోరాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.