సుజనా తనయుడి కార్ రేసింగ్
కార్ రేసింగ్‌కు పాల్పడుతూ పోలీసులకు చిక్కిన శ్రీకార్తీక్
ర్యాష్ డ్రైవింగ్‌తో ముచ్చటగా మూడోసారి...
రూ.1000 జరిమానా, ఖరీదైన కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు
హైదరాబాద్: స్నేహితులతో పందెం కాసి గంటకు 140 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తూ కేంద్ర మంత్రి సుజనా చౌదరి తనయుడు యలమంచిలి శ్రీకార్తీక్ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. బంజారాహిల్స్ రహదారులపై శుక్ర వారం అర్ధరాత్రి శ్రీకార్తీక్ (25) తన స్నేహితులతో కలసి ఖరీదైన స్పోర్ట్స్ కారులో రేసింగ్‌కు పాల్పడి పోలీసులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో పట్టుబడ్డాడు. శుక్రవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో బంజారాహిల్స్ కేబీఆర్ పార్కు, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో రేస్‌లు జరుగుతున్నట్లు ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు కేబీఆర్ పార్కు నుంచి జూబ్లీహిల్స్ చౌరస్తా వరకు ప్రత్యేక బలగాలను, పికెట్లను ఏర్పాటు చేశారు.
ఒంటిగంట సమయంలో శ్రీకార్తీక్ తన పోర్షే స్పోర్ట్స్ కారు(ఏపీ 09 సీవీ 9699)లో కేబీఆర్ పార్కు నుంచి జూబ్లీహిల్స్ చౌరస్తా వైపు అదుపు తప్పిన వేగంతో దూసుకొచ్చాడు. చౌరస్తాలో ఉన్న ట్రాఫిక్ పోలీసులను చూసి యూటర్న్ తీసుకుని తిరిగి ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌వైపు అంతే స్పీడ్‌తో దూసుకెళ్లాడు. అయితే కేబీఆర్ పార్కు చౌరస్తాలో మరో స్పెషల్ డ్రైవ్ బృందానికి పట్టుబడ్డాడు. శ్రీకార్తీక్‌పై ర్యాష్ డ్రైవింగ్ కేసులో మోటారు వాహనాల చట్టం 184(బి), ఓవర్ స్పీడ్ చట్టం 183 కింద, నంబర్‌ప్లేట్ అడ్డదిడ్డంగా ఉన్నందుకు సెక్షన్ 80(ఏ) కింద కేసులు నమోదు చేశారు.
పారిపోవడానికి యత్నం..
ఓవర్‌స్పీడ్ కేసులో రూ. 1000 జరిమానా విధించి చలానా అందజేశారు. పోలీసులు పట్టుకున్న సమయంలో శ్రీకార్తీక్ మరోసారి పరారయ్యేందుకు యత్నించగా పోలీసులు చాకచక్యంగా వాహనాన్ని నియంత్రించారు. శ్రీకార్తీక్‌పై కేసు నమోదు చేసి జరిమానా విధించిన పోలీసులు బేగంపేటలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సిందిగా సూచించారు. కారును స్వాధీనం చేసుకున్నారు. మరోసారి పట్టుబడితే ఐపీసీ సెక్షన్‌తో పాటు రిమాండ్‌కు తరలించాల్సి ఉంటుందని.. డ్రైవింగ్ లెసైన్స్ రద్దుకు సిఫారసు చేస్తామని వెస్ట్‌జోన్ ట్రాఫిక్ డీసీపీ ఎల్‌ఎస్‌చౌహాన్ వెల్లడించారు. కాగా శ్రీకార్తీక్ పెళ్లి రెండు రోజుల్లో జరుగనుంది. శనివారం ఆయనను పెళ్లి కొడుకును చేసేందుకు ఏర్పాటు కూడా చేశారు.