
కేసీఆర్‌కు రోజులు దగ్గరపడ్డాయి
సీఎం క్యాంపు కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం సిగ్గుచేటు: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు రోజులు దగ్గర పడ్డాయని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంగళ వారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. రైతును ఏడిపించే రాజ్యం, ఎద్దేడ్చిన ఎవుసం ఎన్నటికీ ముందుకు పోవని హెచ్చ రించారు. ముఖ్యమంత్రి ఇంటి ముందే రైతు ఆత్మహత్యకు పాల్పడాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని, అంతకంటే సిగ్గు చేటు ప్రభుత్వానికి ఏముంటుందని ప్రశ్నిం చారు. రైతుల పట్ల ఎంత పాశవికంగా, నిర్ద యగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదో అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఎదుటనే గద్వాలకు చెందిన రైతు మల్లేశం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడని, ఇంతకంటే దారుణమైన విషయం మరొకటి ఉండదన్నారు.
వ్యవసాయం చేసి అప్పుల పాలయ్యా నని, ఆదుకోవాలని గతంలో ఎన్నోసార్లు క్యాంపు కార్యాలయానికి మల్లేశం వచ్చాడని వివరించారు. ప్రగతిభవన్‌లో రాచరికపు భోగాలు అనుభవిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రజలను కలవడానికి సమయం లేకుండా పోయిందని విమర్శించారు. కేసీఆర్ కూతురు, నిజామాబాద్ ఎంపీ కవిత.. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పరిహారం ఇప్పిస్తా మని చెప్పడంతో ఆశ పడిన మల్లేశం కాగితాలు పట్టుకొని క్యాంపు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడని వివరించారు. ఎన్నిసార్లు తిరిగినా కనికరించకపోవడంతో అవమానభారంతో, విరక్తితో మల్లేశం ఆత్మహత్యాయత్నం చేశాడని పేర్కొన్నారు. ఈ రైతు చావుబతుకులతో కొట్టు మిట్టాడుతున్నా ఒక్క టీఆర్‌ఎస్ నాయకుడు కూడా పరామర్శించలేదని విమర్శించారు.
మిర్చి పంటలకు గిట్టు బాటు ధరలు కావాలని అడిగితే లాఠీచార్జ్ చేసి, రైతులను రౌడీలుగా చిత్రీకరించి, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి, చేతులకు బేడీలు వేసి హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుల బాధలతో ఇప్పటికే 3,500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో సీఎం ఇంటి ముందు రైతులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు వచ్చాయన్నారు. ముఖ్యమంత్రి ఇప్పటి సమస్యలను పక్కన పెట్టి వచ్చే ఏడాది ఖరీఫ్ గురించి మాయమాటలు చెబుతున్నారని, ఓట్ల రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.