సెంటిమెంటుతో పబ్బం గడుపుకోలేరు
కొడుకు, అల్లుడు, కూతురుకో జిల్లా అంటే ఒప్పుకోం: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్ : సెంటిమెంటు, మభ్యపెట్టే మాటలతో టీఆర్‌ఎస్ ఎక్కువకాలం పబ్బం గడుపుకోలేదని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. గాంధీభవన్‌లో మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ...‘సీఎం కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసి రెండేళ్లు పూర్తయినా మభ్యపెట్టే మాటలు, అరచేతిలో స్వర్గం చూపించడం తప్ప చేసిందేమీ లేదు. కొత్త రాష్ట్రం, తెలంగాణ సెంటిమెంటు, ఇంకా కొంత సమయం ఇచ్చి చూద్దామనే ధోరణిలో ప్రజలున్నారు. టీఆర్‌ఎస్, కేసీఆర్ తీరుపై ప్రజల్లో ఇప్పుడిప్పుడే చర్చ జరుగుతోంది. మాటల్లో కాకుండా ఆచరణలో ఏం చూపిస్తున్నావనేదానిపైనే వారు నిర్ణయం తీసుకొంటారు. జిల్లాల విభజనకు ప్రాతిపదిక ఏమిటో, విధానం ఏమిటో స్పష్టంగా ప్రకటించాలి. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రజల అవసరాల కోసం మాత్రమే ఉండాలి. కొడుకు జెండా ఎగురేయాలని సిరిసిల్ల... అల్లుని కోసం సిద్దిపేట... కూతురు కోసం మరో జిల్లా ఏర్పాటు చేయాలనుకుంటే అంగీకరించేది లేదు. జిల్లాల ఏర్పాటుకు మేం వ్యతిరేకం కాదు. కానీ రాజకీయ, కుటుంబ ప్రయోజనాల కోసం చేస్తే సహించేదిలేదు’ అన్నారు.
అది అప్రజాస్వామికం...
అసెంబ్లీపై కేసీఆర్‌కు గౌరవం లేదని, అసెంబ్లీ సమావేశాలు మొక్కుబడిగా, రాజ్యాంగ అవసరాల కోసమే నిర్వహిస్తున్నారని ఉత్తమ్ ఆరోపించారు. అసెంబ్లీలో టీడీఎల్పీ కార్యాలయాన్ని ఖాళీ చేయిం చడం అప్రజాస్వామికమన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ఫిరాయింపులపై అనర్హత పిటిషన్ 18న సుప్రీంకోర్టులో విచారణకు రానుందన్నారు. సీఎంగా కేసీఆర్ పగ్గాలు చేపట్టగానే రాష్ట్రంలో కరువు, కాటకాలు వచ్చాయన్నారు. ఈ రెండేళ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్క పంటకూ నీరివ్వలేకపోయిందని, సాగు చేసిన పంటలు కూడా ఎండిపోయాయన్నారు. వ్యవసాయంపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా దీక్ష చేస్తామన్నారు. ఈ నెల 30న రైతు గర్జన నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించామని, దీనికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ హాజరవుతారని వెల్లడించారు.