అబద్దాల్లో గోబెల్స్‌నే మించింది
టీఆర్‌ఎస్‌పై ఉత్తమ్ ఫైర్
ప్రాణహిత పాతదే గానీ..: జగదీశ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: అబద్దాలు చెప్పి ప్రజలను మోసగించడంలో టీఆర్‌ఎస్, రాష్ట్ర ప్రభుత్వం గోబెల్స్‌ను మించాయని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. అసెంబ్లీ లాబీల్లో శనివారం ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న సాగునీటి ఒప్పందాలతో బ్రహ్మాండం బద్దలైపోతోందనేలా భ్రమలు కల్పించి టీఆర్‌ఎస్ నేతలు సంబరాలు చేసుకున్నారన్నారు. ‘‘గోదావరిపై ప్రాజెక్టుల విషయంలో మహారాష్ట్రతో ఒప్పందమే జరగలేదు. కేవలం అంతర్రాష్ట్ర బోర్డుపై మాత్రమే ఒప్పందం చేసుకున్నారు.
తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందమేదీ చేసుకోలేదని మహారాష్ట్ర నీటిపారుదల మంత్రే ప్రకటించారు. ప్రాణహితపై మూడేళ్ల క్రితం కాంగ్రెస్ హయాంలో జరిగిన ఒప్పందాన్నే ఇప్పుడు టీఆర్‌ఎస్ మళ్లీ గొప్పగా చెప్పుకుం టోందంతే. పాలమూరు-రంగారెడ్డి పథకం కమీషన్ల కోసమే తప్ప ప్రజలకు ఉపయోగపడే పరిస్థితులున్నాయా? కృష్ణా పుష్కరాలొస్తున్నా నదిలో నీళ్లే లేవు. సభలో చర్చల తీరు సంతృప్తికరంగా లేదు’’ అన్నారు. అసెంబ్లీ కంటే శాసనమండలిలోనే చర్చలు ఆసక్తికరంగా జరుగుతున్నాయని, టీఆర్‌ఎస్‌పై విపక్ష సభ్యులు దాడి చేస్తున్నారని విలేకరులు చెప్పడంతో హర్షం వెలిబుచ్చారు. మంత్రి జి.జగదీశ్‌రెడ్డితో మహారాష్ట్రతో ప్రాణహిత ఒప్పందం పాతదేనని ఉత్తమ్ అంటున్నారని ఓ విలేకరి చెప్పాగా, ‘అవును పాతదే. కానీ మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందంలో ప్రాణహిత అనే పేరుందా? చూసుకోమనండి’ అంటూ వెళ్లిపోయారు.