'రికమండ్ చేసే వారే గెలుపు బాధ్యత తీసుకోవాలి'
హైదరాబాద్: గాంధీభవన్లో ఆదివారం కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. గ్రేటర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో పార్టీ నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రేటర్ ఎన్నికల్లో గెలుపు అవకాశాలు ఉన్నవారికే టికెట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ డివిజన్ల రిజర్వేషన్లు ఖరారైన తరువాత టికెట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు.
టికెట్లు కావాల్సిన వారు, తమ అనుచరులకు టికెట్లు కావాలనుకునే వారు మంగళవారం లోగా గాంధీ భవన్లో వివరాలను అందించాలని ఉత్తమ్ సూచించారు. అభ్యర్థులను రికమండ్ చేసే వారే.. వారిని గెలిపించే బాధ్యత కూడా తీసుకోవాలన్నారు. ఈ నెల ఆరున అన్ని డివిజన్ కేంద్రాల్లో పాదయాత్రలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రచారానికి ఎనిమిది రోజులే గడువు ఉండే అవకాశం ఉంది కావున నేతలంతా సమిష్టిగా కృషి చేయాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు.