‘రాజహంస’ కోసం క్యూ కట్టారు..
ఏవియేషన్ షోలో రెండో రోజూ సందర్శకుల కిటకిట
హైదరాబాద్: పొగలు కక్కుతూ ఆకాశంలోకి దూసుకుపోవడం... అంతలోనే కిందపడుతుందేమో అనిపించడం.. మళ్లీ వేరే డెరైక్షన్‌లో విమానం దూసుకుపోవడం.. దానికి వ్యతిరేక దిశలో మరో విమానం దూసుకువచ్చి రెండూ క్రాష్ అయిపోతాయేమో అని భ్రమ కల్పించడం.. మొత్తం గా ఏవియేషన్ షోలో వైమానిక విన్యాసాలు సందర్శకులను ఊపిరి బిగబట్టేలా చేశాయి. రెండో రోజు కూడా ఏవియేషన్ షో కిటకిటలాడింది.
ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే వైమానిక విన్యాసాలు సందర్శకులను కట్టిపడేశాయి. మరోవైపు వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు ఎగ్జిబిషన్‌లో తమ ఉత్పత్తుల స్టాల్స్‌ను ప్రదర్శించారు. విమానయానానికి అనుబంధంగా ఆయా ఉత్పత్తులు అధునాతన టెక్నాలజీని సంతరించుకుని సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.
అందరి బాటా... రాజహంస వైపే..
ఏవియేషన్ షోకే హైలైట్‌గా నిలుస్తోన్న ఎమిరేట్స్(రాజహంస)ను చూసేందుకే సందర్శకులు మక్కువ కనబరుస్తున్నారు. గంటల తరబడి క్యూలో నిలబడి మరీ ఆ డబుల్ డెక్కర్ విమానంలో అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. గవర్నర్ నరసింహన్ దంపతులు, డీజీపీ అనురాగ్‌శర్మ తదితరులు సైతం ఏవియేషన్ షోను సందర్శించి ఎమిరేట్స్ విమానాన్ని ఎక్కి అందులోని ప్రత్యేకతలను తెలుసుకున్నారు. ఇక సందర్శకులైతే మండుటెండలో క్యూలో నిలబడి ఆ విమానాన్ని చూసి మహదానందం పొందారు.