డ్వాక్రా రుణమాఫీపై దద్దరిల్లిన సభ
♦ డ్వాక్రా మహిళల్ని ప్రభుత్వం మోసం చేసింది
♦ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ధ్వజం
♦ సీఎం సంతకమే చెల్లని సంతకమైంది: గిడ్డి ఈశ్వరి
♦ రూ.10 వేల కోట్లు మాఫీ చేశామన్న మంత్రి మృణాళిని
సాక్షి, హైదరాబాద్: డ్వాక్రా రుణమాఫీపై బుధవారం అసెంబ్లీ దద్దరిల్లింది. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యేలు డ్వాక్రా రుణమాఫీ విషయంలో ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఈ సందర్భంగా అధికార, విపక్ష ఎమ్మెల్యేల మధ్య వాగ్యుద్ధం జరిగింది. ఉదయం ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమైన కొద్దిసేపటికే వైఎస్సార్‌సీపీ సభ్యులు ఉప్పులేటి కల్పన, గిడ్డి ఈశ్వరి, పుష్పశ్రీవాణి, వి.కళావతి, గౌరు చరితారెడ్డిలు డ్వాక్రా రుణమాఫీపై ప్రశ్నలు సంధించారు.
ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష ఉప నాయకురాలు ఉప్పులేటి కల్పన మాట్లాడుతూ మహిళా సాధికారత, డ్వాక్రా రుణమాఫీ అని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మహిళలను దగా చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రూ.14 వేల కోట్లకుపైగా రుణాలు మాఫీ చేయాల్సిఉంటే కేవలం రూ.3,776 కోట్లు ఇస్తున్నట్టు చెప్పి.. అందులోనూ మహిళకు రూ.3వేల చొప్పున మూలధనం కింద జమచేయడం మోసం కాదా? అని ప్రశ్నించారు. 10 లక్షల డ్వాక్రా సంఘాలుంటే రుణమాఫీ కాకపోవడంతో వడ్డీలు కట్టలేక సంఘాలన్నీ ఏ గ్రేడు నుంచీ డి గ్రేడులోకి వెళ్లాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు కుట్టుమిషన్లన్నారు.. అన్నక్యాంటీన్‌లు అన్నారు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్‌ప్లాన్‌లో రుణాలన్నారు.. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రుణాలన్నారు.. ఎక్కడ, ఎంతమందికి రుణాలిచ్చారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
సీఎం సంతకమే చెల్లనిదైంది
‘‘సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం రోజునే ఐదు ఫైళ్లపై సంతకం చేశారు.. ఆ ఐదింటిలో డ్వాక్రా రుణమాఫీ ఒకటి. కానీ నేడు డ్వాక్రా మహిళలకు రుణమాఫీ కాలేదంటే ముఖ్యమంత్రి సంతకానికి విలువ లేదనే కదా?’’ అని వైఎస్సార్‌సీపీ సభ్యురాలు గిడ్డి ఈశ్వరి ప్రశ్నించారు. మంత్రి మృణాళిని సమాధానమిస్తూ.. ఎవరూ చేయనివిధంగా రాష్ట్రంలో రూ.10 వేల కోట్లు రుణమాఫీ చేశామన్నారు. పెట్టుబడి నిధి కింద రూ.2,347 కోట్లు ఇచ్చినట్టు చెప్పారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
పదేపదే మైక్ కట్..
డ్వాక్రా రుణమాఫీ, మహిళా సాధికారతపై సభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. విపక్ష మహిళా ఎమ్మెల్యేలు మాట్లాడుతుండగా స్పీకర్ కోడెల శివప్రసాదరావు పదేపదే మైక్ కట్ చేశారు. దీనిపై సుమారు పది నిమిషాలసేపు సభ దద్దరిల్లింది. డ్వాక్రా రుణాల మాఫీ జరగలేదని, దీనిపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు అవకాశమివ్వాలని పదేపదే వేడుకున్నా స్పీకర్ ఇవ్వకపోవడం దారుణమని విపక్ష ఎమ్మెల్యేలు వాపోయారు. దీంతో ఒక్కసారిగా విపక్ష సభ్యులందరూ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి న్యాయం చేయాలని నినదిస్తూ నిరసన తెలిపారు. ఒకదశలో సభలో నినాదాలు జరుగుతున్నప్పటికీ స్పీకర్ ప్రశ్నోత్తరాల్ని కొనసాగించారు.