
వరంగల్ ఎంపీ టికెట్ ఎస్సీలకు ఇవ్వాలి
తెలంగాణ మాదిగ జేఏసీ చైర్మన్ పిడమర్తి రవి
పంజగుట్ట: టీఆర్‌ఎస్ పార్టీ వరంగల్ ఎంపీ టిక్కెట్ మాదిగలకు కేటాయించాలని తెంగాణ మాదిగ జేఏసీ చైర్మన్ పిడమర్తి రవి ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ మాదిగ జేఏసీ రాష్ట్ర సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ... మాదిగలకు 12 శాతం రిజర్వేషన్లు, వర్గీకరణ సాధనకు జాతీయ స్థాయిలో మలిదశ ఉద్యమం చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందులో మాదిగ విద్యార్థులు, యువకులను భాగస్వాములను చేసేందుకు డిసెంబర్ మొదటి వారంలో ఉస్మానియాలో ‘మాదిగల విద్యార్థి, యువ గర్జన’ నిర్వహిస్తున్నామన్నారు.
ఇందుకు 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యువజన, విద్యార్ధి కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయా కమిటీలతో ఈ నెల 15న ఓయూలో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహిస్తామన్నారు. జేఏసీ ప్రతినిధులు బొట్ల భిక్షపతి, రాయకంటి రామ్‌దాస్, వినాయక్ మాట్లాడుతూ ... వరంగల్ ఎంపీ టిక్కెట్ పిడమర్తి రవికి కేటాయిస్తే ఆయనను గెలిపించుకుంటామన్నారు. కార్యక్రమంలో గారె వెంకటేశ్, బండారి వీరబాబు, శ్రీను, డాక్టర్ వీరేందర్, గద్దల అంజిబాబు తదితరులు పాల్గొన్నారు.