
సాక్షి, హైదరాబాద్: కాకతీయ కళా వైభవం పేరుతో నటులను సన్మానిస్తే సహించబోమని కాకతీయ హెరిటేజ్ ట్రస్టు.. మాజీ ఎంపీ టి. సుబ్బరామిరెడ్డిని హెచ్చరించింది. ఈ పేరుతో స్థానిక కళలు, కళాకారుల పురోగతికి తోడ్పడితే స్వాగతిస్తామంది. శుక్రవారం కాకతీయ హెరిటేజ్ వ్యవస్థాపక సభ్యుడు పాపారావు విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి సినిమా రంగం తీవ్ర నష్టం చేసిన సంగతి గుర్తించాలన్నారు.
సినిమా సంస్కృతిని బుద్ధిస్ట్ హెరిటేజ్‌కు ముడిపెట్టే ప్రయత్నం చేయటం తగదన్నారు. ఇలాంటి చర్యలను ముందుగానే అడ్డుకోవాలన్నారు. రెండు రోజుల క్రితం సుబ్బిరామిరెడ్డి నగరంలోని శిల్పకళావేదికలో నటుడు మోహన్‌బాబును సన్మానించి బిరుదు ప్రదానం చేసిన విషయం తెలిసిందే.