చెరువుల దిగువ ప్రాంతంలో నాలాలు పూర్తిగా కబ్జాకు గురి కావడంతో నగరంలో పలు కాలనీలు ముంపునకు గురయ్యాయి.
మియాపూర్: చెరువుల దిగువ ప్రాంతంలో నాలాలు పూర్తిగా కబ్జాకు గురి కావడంతో నగరంలో పలు కాలనీలు ముంపునకు గురయ్యాయి. ఇందుకు తాజా ఉదాహరణ మియాపూర్. ఈ ప్రాంతంలో 10 వరకు చెరువులు ఉన్నాయి. ఒక దానికొకటి అనుసంధానంగా నాలాలు ఉన్నాయి. ఈ చెరువుల కింద పూర్తిగా నాలాలు కబ్జాకు గురయ్యాయి. ఒక్క పటేల్ చెరువు కింద ఉన్న నాలా పక్కనే దాదాపుగా 10 కాలనీలు, అపార్ట్‌మెంట్లు వెలిశాయి. దీంతో నాలా దాదాపు కనుమరుగయింది. ఓ కళాశాల యాజమాన్యం తన నిర్మాణాలకు అడ్డుగా ఉన్నందున నాలా ఆనవాలు లేకుండా పూడ్చి వేసి కేవలం చిన్న పైపులను ఏర్పాటు చేసింది.
దాదాపు ఈ నాలా వెడల్పు రెవెన్యూ రికార్డుల ప్రకారం 40 అడుగులుంటుంది. కానీ, ఇప్పుడు అది 4 అడుగులు కూడా లేదు. దీంతో వాన, డ్రెయినేజీ నీరు నాలాల గుండా పోలేని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా కాలనీల ప్రధాన రహదారులపై నీరు ప్రవహిస్తుంది. అధికారులు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చి అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో నిర్మాణ దారులు తమ ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపట్టి నాలాలను పూడ్చివేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ప్రధానంగా దీప్తీశ్రీనగర్, సీబీఆర్ ఎస్టేట్, దుర్గా ఎస్టేట్, శాంతినగర్, ఆదర్శనగర్, విశ్వేశ్వరయ్య కాలనీ, మదీనాగూడతో పాటు మరికొన్ని అపార్ట్‌మెంట్‌లలో 6 వేలకు పై చిలుకు మంది నివాసం ఉంటున్నారు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షానికి ఈ కాలనీలు అన్ని పూర్తిగా జలమయమయ్యాయి.