గండిపేట గుండెకోత | water problem in hyderbad | Sakshi
Sakshi News home page

గండిపేట గుండెకోత

Published Wed, Apr 6 2016 12:01 AM | Last Updated on Sun, Sep 3 2017 9:16 PM

గండిపేట గుండెకోత

గండిపేట గుండెకోత

అడుగంటుతున్న జలాశయం
పెద్ద సంఖ్యలో చేపల మృత్యువాత


మహా నగర దాహార్తిని తీర్చే జలాశయాలే దాహంతో అలమటిస్తున్నాయి. భానుడి    ప్రతాపానికి విలవిల్లాడుతున్నాయి. తమనే నమ్ముకున్న జీవరాశులకు సైతం భరోసా  ఇవ్వలేకపోతున్నాయి. సువిశాల విస్తీర్ణంలోని గండిపేట జలాశయం తనపై ఆధారపడిన  చేపలను నిర్జీవంగా ఒడ్డున పడేసిన ‘చిత్రం’.. చూసిన వారి గుండెలు తరుక్కుపోతున్నాయి.

 

సిటీబ్యూరో:మహా నగరంలో ఎండల తీవ్రతకు జలాశయాలు అడుగంటుతున్నాయి. పశుపక్ష్యాదులు ప్రాణాలు కోల్పోతున్నాయి. జనం అల్లాడుతున్నారు. మండుటెండలతో చారిత్రక ఉస్మాన్ సాగర్ (గండిపేట) నీళ్లు లేక చిన్నబోయి కనిపిస్తోంది. ఈ జలాశయ గరిష్ట మట్టం 1790 అడుగులు. ప్రస్తుతం 1750 అడుగులకు పడిపోయింది. నీటి మట్టం తగ్గడంతో ఒడ్డుకు కొట్టుకొచ్చిన చేపలు వేసవి తాపాన్ని తాళలేక మృత్యువాత పడుతున్నాయి. ఈ దృశ్యం చూసిన వారిని కలచివేస్తోంది.


జలాశయం దుస్థితికి కారణాలివే...
ఎగువ ప్రాంతాల్లో ఉన్న సుమారు 84 గ్రామాల నుంచి జంట జలాశయాలకు వరద నీటిని చేర్చే కాల్వలు (ఇన్‌ఫ్లో చానల్స్) కబ్జాకు గురవడం, ఇటుక బట్టీలు, ఇసుక మాఫియాకు అడ్డాలుగా మారడం, ఫాంహౌస్‌లు, ఇంజినీరింగ్ కళాశాలలు, గోడౌన్లు, ఇతర వాణిజ్య కార్యకలాపాలకు నిలయంగా మారాయి.

    
ఉస్మాన్ సాగర్ పరిరక్షణకు పర్యావరణ ఇంజినీరింగ్ సంస్థ ‘నీరి’ నిపుణులు 2011లో సమగ్ర అధ్యయనం చేసి తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వా నివేదిక సమర్పించారు. కానీ ఆ సంస్థ సిఫారసులకు ఐదేళ్లుగా మోక్షం లభించలేదు. సమీప గ్రామాల నుంచి మురుగు నీరు జంట జలాశయాల్లో కలుస్తుండడంతో చారిత్రక సాగరాలు కలుషితమవుతున్నాయి.  జలాశయం ఎగువ ప్రాంతాల్లో ఉన్న 45 ఇంజినీరింగ్ కళాశాలల నుంచి నిత్యం మురుగునీరు సాగరాల్లోకిచేరుతోంది. కళాశాలల యాజమాన్యాలు సొంతంగా చిన్నపాటి మురుగు శుద్ధి కేంద్రాల (మినీ ఎస్టీపీలు)ను నిర్మిం చుకునే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి.

 
పరిష్కారాలు...

సుమారు పదివేల కి.మీ. సువిశాల విస్తీర్ణంలో ఉన్న ఈ జలాశయాల సరిహద్దులు, జీఓ. నెం 111 ప్రకారం ఎగువ ప్రాంతాల్లో మరో పది కి.మీ. వరకు సరిహద్దుల ను పక్కాగా గుర్తించేందుకు జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్‌జీఆర్‌ఐ) సాయం తీసుకోవాల్సి ఉంది.జీఐఎస్, శాటిలైట్ చిత్రాలు, టోటల్ స్టేషన్ వంటి ఆధునిక సాంకేతికత ఆధారంగా ఎన్‌జీఆర్‌ఐ సంస్థ సరిహద్దులను గుర్తించిన తరువాత జలాశయాల సరిహద్దులను గుర్తిస్తూ డిజిటల్ మ్యాపులు సిద్ధం చేయాలి.ఎగువ ప్రాంతాల్లో కబ్జాల నిరోధం, ఇసుక ఫిల్టర్లను నిర్వహిస్తున్న అసాంఘిక శక్తుల ఆట కట్టించాలి.కృష్ణా నాలుగో దశ ప్రాజెక్టుతో మహబూబ్‌నగర్ జిల్లా లక్ష్మీదేవి పేట నుంచి కృష్ణా జలాలను నగరానికి తరలించి ఈ జలాశయాల్లో నింపేందుకు ప్రణాళిక సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని నీటి పారుదల రంగ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఈ వేసవిలో జంట జలాశయాల్లో భారీగా పేరుకుపోయిన పూడికను తొలగించాలని సూచిస్తున్నారు. జంతు, చెట్ల అవశేషాలు, గుర్రపుడెక్క తొలగింపు, అడుగున పేరుకుపోయిన సిల్ట్‌ను తొలగించాలని సూచిస్తున్నారు.నీటి రంగు మారకుండా జలాశయంలో ఏరియేషన్(ఆక్సిజన్ స్థాయి పెంపునకు) వ్యవస్థలను ఏర్పాటు చేయాలని పర్యావరణవేత్తలు  సూచిస్తున్నారు. జలాశయంలోకి వర్షపు నీటిని చేర్చే ఇన్‌ఫ్లో చానల్స్‌ను ఈ వేసవిలోనే యుద్ధ ప్రాతిపదికన ప్రక్షాళన చేయాలని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు.ఎగువ ప్రాంతాల్లో అక్రమంగా వెలసిన ఫాంహౌస్‌లు, ఇంజినీరింగ్ కళాశాలలు, రియల్ వెంచర్లను తొలగించాలి. ఈ జలాశయాలు పూర్వపు స్థాయిలో నిండుకుండల్లా జలకళను సంతరించుకుంటే నగరానికి రోజువారీగా 40 మిలియన్ గ్యాలన్ల తాగునీటిని పొందే అవకాశం ఉంటుందని, దాదాపు పాతనగరం దాహార్తి సమూలంగా దూరమవుతుందని నిపుణులు తెలిపారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement