ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగిస్తాం
చిన జీయర్ స్వామి షష్టిపూర్తి వేడుకల్లో సీఎం కేసీఆర్
- స్వామి సంస్కారం అందరికీ ఆదర్శం
- ఆయన ప్రసంగాలు ప్రజల్ని సన్మార్గం వైపు మళ్లిస్తున్నాయి
- 22 ఏళ్ల కిందట స్వామితో కొద్దిరోజులు ఉండే భాగ్యం దక్కింది
- నా కారులో నేను డ్రైవర్‌గా ఆయన్ను తిప్పడం గొప్ప అనుభూతి
- రామానుజుల విగ్రహ ప్రతిష్టాపన సంకల్పం తెలంగాణకే గర్వకారణం
- పాల్గొన్న గవర్నర్లు నరసింహన్, విద్యాసాగర్‌రావు,
- కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ తదితరులు
సాక్షి, హైదరాబాద్: ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్రంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులోనూ వాటిని కొనసాగిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఉద్ఘాటించారు. ప్రజలను సన్మార్గం వైపు మళ్లించేలా చినజీయర్ స్వామి ఆధ్యాత్మిక ప్రసంగాలు దోహదం చేస్తున్నాయని, చాలా సరళమైన భాషలో ఆయన చేసే అనుగ్రహ భాషణాలు భక్తిప్రపత్తులతో కూడుకున్న విన్యాసాలని కొనియాడారు. త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామి షష్టిపూర్తి సందర్భంగా ఆదివారం సాయంత్రం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ‘షష్టిస్ఫూర్తి జనోత్సవ్’ కార్యక్రమం ఘనంగా జరిగింది. దీనికి సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, కేంద్రమంత్రులు ఎం.వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... నగర శివారులోని శంషాబాద్‌లో రామానుజాచార్యుల భారీ విగ్రహాన్ని ప్రతిష్టించాలన్న జీయర్ స్వామి సంకల్పం తెలంగాణకు గర్వకారణంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆ నిర్ణయానికిగాను తన పక్షాన, రాష్ట్ర ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు వెల్లడించారు.
జీయర్ స్వామి సాన్నిహిత్యంలో ఉండటం తనకు కొత్త కాదని, 22 సంవత్సరాల క్రితం తాను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉండగా ఆయనతో కొద్దిరోజుల పాటు కలిసి ఉండే భాగ్యం దక్కిందని గుర్తు చేసుకున్నారు. ‘‘వికాసతరింగిణి ఆధ్వర్యంలో రెండు దశాబ్దాల క్రితం సిద్దిపేటలో బ్రహ్మయజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ సందర్భంగా పట్టణానికి వచ్చిన జీయర్‌స్వామికి స్వాగతం పలికి అక్కడ ఉండే వారం రోజులు మా ఇంటి ఆతిథ్యం స్వీకరించాలని కోరాను. దానికి ఆయన మన్నించి మా ఇంటనే ఉన్నారు. ఆ సందర్భంలో నా కారులో నేను డ్రైవర్‌గా ఆయనను తిప్పటం గొప్ప అనుభూతి. అల్లకల్లోలంగా ఉన్న పంజాబ్, కశ్మీర్‌లో ఆయన పర్యటించి ప్రశాంతతకు కృషి చేశారు.
ఈ విషయం గుర్తొచ్చి కొంత అశాంతి నెలకొన్న సిద్దిపేటలో పర్యటించాలని కోరినప్పుడు శాంతి శోభాయాత్ర నిర్వహించటం గొప్ప అనుభూతినిచ్చింది. భక్తిగా యజ్ఞం చేస్తే చివరిరోజు వాన కురుస్తుందని జీయర్ స్వామి చెప్తే ఏమో అనుకున్నా. కానీ అది ఏప్రిల్ నెల అయినప్పటికీ చివరి రోజు యజ్ఞవాటిక అస్తవ్యస్తమయ్యేలా వాన కురిసి ఆశ్చర్యపరిచింది. ఆ సమయంలో నాకున్న పరిమిత పరిజ్ఞానంతో ఎన్నో ప్రశ్నలు వేసి సమాధానాలు తెలుసుకున్నా. నిత్యం కార్యక్రమం ప్రారంభ సమయంలో తన గురువైన గోపాలాచార్యులకు పాదాభివందనం చేసే జీయర్‌స్వామి సంస్కారం మనకందరికీ ఆదర్శమని అప్పుడే అనుకున్నా. ఈరోజు ఆయన షష్టిపూర్తి ఉత్సవంలో పాల్గొనటం ఎంతో సంతోషంగా ఉంది’’ అంటూ సీఎం తన పాత అనుభవనాలను గుర్తు చేసుకున్నారు.
రామానుజుల మార్గం అనుసరణీయం: విద్యాసాగర్‌రావు
వెయ్యేళ్ల క్రితం రామానుజ స్వామి చేసిన బోధనలు ఇప్పటికీ అనుసరణీయమని మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు అన్నారు. ఇప్పుడు తెలంగాణలో మిషన్ భగీరథ, సాగునీరిచ్చేం దుకు చేస్తున్న ప్రయత్నాలు గొప్పవేనని, కానీ ఈ ఆలోచనలను రామానుజస్వామి అప్పుడే చేసి చూపారన్నారు. ఇప్పుడు జీయర్‌స్వామి కూడా అదే దారిలో సాగుతూ సమాజానికి మార్గదర్శనం చేస్తున్నారన్నారు. మంచి మార్గం వైపు సాగేందుకు చేయాల్సిన ప్రయత్నాలకు ఈ వేడుక ఓ వేదిక అని పేర్కొన్నారు. ఇక్కడ ఎంత పెద్ద కేక్ కట్ చేస్తారని తనను రాజ్‌భవన్ సిబ్బంది ప్రశ్నించార న్నారు. అయితే స్వామిని ఆశీర్వదించే శక్తి ఎవరికీ లేదని, ఆయన ఆశీర్వాదం కోసం కలిగిన అరుదైన అవకాశంగా తాను ఈ కార్యక్రమాన్ని భావిస్తున్నట్టు చెప్పానన్నారు.
మానవత్వాన్ని మించిన మతం లేదు: దత్తాత్రేయ
ప్రపంచంలో మానవత్వాన్ని మించిన మతం లేదని, సేవాభావం కన్నా గొప్ప గుణం లేదని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. మానవత్వం, సేవాగుణంతో మూర్తీభవించిన రూపం చిన జీయర్‌స్వామి అని కొనియాడారు.
కుల వ్యవస్థ సిగ్గుచేటు: వెంకయ్య
‘‘ప్రపంచానికి గొప్ప సంస్కృతిని అందించిన మన భారతీయ సంప్రదాయానికి కుల వ్యవస్థ ఓ మచ్చలా మారింది. అది మనకు సిగ్గుచేటు. దాన్ని రూపుమాపాలి. వెయ్యేళ్ల క్రితమే రామానుజ స్వామి కులవ్యవస్థ వద్దని గట్టిగా చెప్పారు. ఆ స్ఫూర్తి మనకు అవసరం. ఇప్పుడు అసమానతలను రూపుమాపేందుకు జీయర్ స్వామి కృషి చేస్తున్నారు’’ అని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. కులానికి సాంఘిక పునాది లేదని, అది వృత్తులతో పుట్టి సామాజిక సమస్యగా మారిందన్నారు. ఇక కుల వ్యవస్థకు కాలం చెల్లిందని, సంఘ సంస్కర్తగా ఆధ్యాత్మిక, సామాజిక ప్రగతి దిశగా బాటలు వేస్తున్న చిన జీయర్ స్వామి మాటలు అందరికీ అనుసరణీయమని శ్లాఘించారు. ‘మతం వ్యక్తిగతం, మన గతం ఒక్కటే’ అన్న మాటను నిజం చేస్తూ ధర్మపరిరక్షణ వైపు నడవాలన్నారు. శంషాబాద్‌లో శ్రీరామానుజస్వామి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న జీయర్ స్వామి నిర్ణయాన్ని ప్రధాని మోదీ కూడా స్వాగతించారన్నారు.
మానవ రూపంలో వెలసిన అవతారం: గవర్నర్
కురుక్షేత్రంలో అర్జునుడికి అయోమయం నెలకొన్నప్పుడు సారథిగా శ్రీకృష్ణుడు దారిచూపినట్టు ఈ ప్రపంచమనే కురుక్షేత్రంలో మనం సరైన బాటలో పయనించేలా చిన జీయర్‌స్వామిలాంటి వారు కృషి చేస్తున్నారని గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. మనుషులకే కాకుండా చెట్లు, పశుపక్ష్యాదుల కోసం జీయర్ స్వామి చేస్తున్న సేవలు గొప్పవన్నారు. రాముడు, కృష్ణుడు మానవ రూపంలో అవతరించినట్టుగానే జీయర్ కూడా ఓ అవతారమని తాను భావిస్తానన్నారు.