రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం
మీడియాతో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. గురువారం దిల్‌కుషా అథితిగృహంలో రాష్ట్ర వ్యవసాయ అధికారులు, బీమా కంపెనీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. అనంతరం దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ కేంద్రం 2016లో ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన ద్వారా అనేక మంది రైతులు లబ్ధి పొందారని, కానీ, తెలంగాణలోని 60 లక్షలమంది రైతుల్లో 6 లక్షల మందికి మాత్ర మే ఫసల్ బీమా యోజనను వర్తింపజేయడం విచారకరమని, ప్రతి రైతుకు ఇది వర్తింపజేయాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రూ.72 కోట్ల ప్రీమియం చెల్లిస్తే, బీమా కంపెనీలు రైతులకు రూ.200 కోట్లు చెల్లిస్తాయని తెలిపారు. రైతు సంఘాలను భాగస్వాములను చేసి ఫసల్ బీమా యోజనపై అవగాహన సదస్సులు నిర్వహించాలని అధికారులు, ప్రజాప్రతినిధులను కోరా రు. యూనిఫైడ్ ప్యాకేజీ స్కీమ్ కింద దేశవ్యాప్తంగా 50 జిల్లాల్లో, తెలంగాణలోని నిజామాబాద్‌లో మంచి ఫలితాలు వచ్చాయన్నారు.