అరుణ్ జైట్లీ ఫోన్‌లో ఏం చెప్పారు?
సంభాషణ వివరాలను సీఎం చంద్రబాబు బయటపెట్టాలి: బొత్స
హైదరాబాద్: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తనతో ఏం మాట్లాడారో.. ప్రత్యేక హోదాపై ఏం హామీ ఇచ్చారో ఆ సంభాషణ వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు బయట పెట్టాలని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఒక కేంద్ర మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్‌లో మాట్లాడుకోవడం అనేది వారి వ్యక్తిగత వ్యవహారం కానే కాదని, అది ఏపీ ప్రజలకు సంబంధించిన విషయం కనుక వెల్లడించాల్సిందేనని స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో తొలి రెండు రోజులు తమ సీట్ల వద్దే ఉండి నినాదాలు చేసిన టీడీపీ ఎంపీలు కేంద్రం నుంచి ఏం హామీ లభిస్తే బుధవారం సభలో మెదలకుండా ఉండిపోయారో... ఆందోళన ఎందుకు చేయలేదో చెప్పాలన్నారు.
ఎందాకైనా పోరాడుతాం
ప్రత్యేక హోదా తప్ప వైఎస్సార్‌సీపీకి మరేమీ ఆమోదయోగ్యం కాదని బొత్స తేల్చిచెప్పారు. హోదా కోసం ఎంత దాకా అయినా పోరాడుతామన్నారు. ఏ ముఖ్యమంత్రి పైనైనా కేంద్రం గతంలో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిందా? అని చంద్రబాబు అమాయకంగా ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించలేదా? ఇటీవల హిమాచల్‌ప్రదేశ్ సీఎం పై విచారణ వేయలేదా? అని బొత్స గుర్తు చేశారు. కాగా, పోలవరానికి సంబంధించిన పత్రాలు ఏపీ నుంచి సకాలంలో అందనందువల్లే అనుమతులను పక్కన పెట్టామని కేంద్రం చెప్పడం సిగ్గు చేటన్నారు.