గ్రామ స్వరాజ్యం అంటే ఇదేనా?
♦ స్థానిక స్వపరిపాలన ఇలాగేనా?
♦ ఏపీ సర్కార్‌పై హైకోర్టు ఆగ్రహం
♦ లబ్ధిదారుల ఎంపిక కమిటీల ఏర్పాటుపై ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలను స్థానిక ప్రజా ప్రతినిధులకు కాకుండా పలువురు వ్యక్తులతో నియమించిన కమిటీలకు అప్పగించడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు పలు శాఖల ముఖ్య కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలను పలు కమిటీలకు అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన పలు జీవోలను సవాలు చేస్తూ తూర్పుగోదావరి జిల్లా, సురంపాళెంకు చెంది న కుంచె వి.వి.జి.ఎస్.ఎన్.మూర్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని శుక్రవారం జస్టిస్ నాగార్జునరెడ్డి విచారించారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పి.వీరారెడ్డి వాదనలు వినిపించగా, సర్కార్ తరఫున అడ్వొకేట్ జనరల్ వేణుగోపాల్ హాజరయ్యారు.
లబ్ధిదారుల ఎంపిక అస్తవ్యస్తం..
ముందుగా వీరారెడ్డి వాదనలు వినిపిస్తూ, రాజకీయ కారణాలతో నియమించిన ఈ కమిటీల వల్ల సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక అస్తవ్యస్తంగా మారిందన్నారు. కమిటీల వల్ల అర్హులకు సంక్షేమ పథకాల ఫలాలు దక్కడం లేదన్నారు. ఇటువంటి కమిటీలను కొనసాగిస్తే రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థలు నీరుగారిపోతాయని, రాజ్యాంగ లక్ష్యం నెరవేరదన్నారు. కమిటీల ఏర్పాటు ద్వారా ప్రభుత్వం స్థానిక ప్రజా ప్రతినిధులకు ఎటువంటి విలువా లేకుండా చేసిందని ఆయన కోర్టుకు నివేదించారు. అధికార పార్టీకి చెందిన, ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులకే ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపిక కమిటీల్లో స్థానం కల్పిం చిందని, తద్వారా ప్రభుత్వం సంక్షేమ పథకాలను రాజకీయ చేసిందన్నారు. అసలు లబ్దిదారులను ఎంపిక చేసే అర్హత ఏదీ కూడా ఈ కమిటీల్లోని సభ్యులకు లేదన్నారు.
మొదట పెన్షన్ల పథకానికే గ్రామ, మండల, మునిసిపాలిటీ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం, ఇప్పుడు వాటిని జన్మభూమి-మాఊరు, నీరు-చెట్టు తదితర కార్యక్రమాలకు విస్తరించి అన్ని చోట్లా లబ్ధిదారుల ఎంపిక కోసం కమిటీలను ఏర్పాటు చేసిందన్నారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి.. ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిటీల ఏర్పాటు ద్వారా స్థానిక స్వపరిపాలన వ్యవస్థను నీరుగార్చమని రాజ్యాంగం చెప్పిందా? అంటూ ప్రశ్నిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని ఏజీ వేణుగోపాల్ కోరడంతో అంగీకరిస్తూ విచారణను వాయిదా వేశారు.
‘ఓ వ్యక్తికి 75 శాతం అంగ వైకల్యం ఉందని నిర్ధారిస్తూ వైద్యులు సర్టిఫికెట్ ఇచ్చారు. దాని ప్రకారం అతను వికలాంగ పెన్షన్ అర్హుడు. అయితే జన్మభూమి కమిటీల్లో ఆ వ్యక్తికి అంగవైకల్యం లేదు.. పెన్షన్ రాదని చెబుతున్నారు. ఇది ఎంత వరకు సమంజసం?’
‘ఓ వృద్ధుడు తనకు 60 ఏళ్లు నిండాయని ధృవీకరణ పత్రంతో సహా పెన్షన్ కోసం వెళితే ఆ పత్రాన్ని చూడకుండా ఆ వ్యక్తిని భౌతికంగా చూసి నువ్వు వద్ధుడు కాదు.. నీకు పెన్షన్ రాదని తిప్పిపంపుతున్నారు. ఇదెక్కడి న్యాయం?’
‘ఫలానా వ్యక్తి సంక్షేమ పథకాల ఫలాలను పొందేందుకు అర్హుడా? కాదా? అని తేల్చేందుకు అసలు ఈ కమిటీకి ఉన్న అర్హతలు ఏమిటి? అర్హులు, అనర్హుల గురించి నిబంధనలు స్పష్టంగా ఉన్నప్పుడు వాటికి విరుద్ధంగా ఎలా వ్యవహరిస్తారు?’
‘గ్రామ స్వరాజ్యం అంటే ఇదేనా! స్థానిక స్వపరిపాలన సాగేది ఇలానా? రాజ్యాంగ లక్ష్యాలను సాధించడం ఇలాగేనా? పెన్షన్ల రూపంలో అర్హులు ఇస్తున్నది ఎవరి డబ్బు? మీరు ఏర్పాటు చేసిన కమిటీల్లో ఉన్న వారి జేబు డబ్బు కాదు కదా! అర్హులైన వారు అన్ని ధృవపత్రాలతోసహా వస్తుంటే వాటిని చూడకుండానే అనర్హులని తేల్చేస్తారా?’
-జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి వ్యాఖ్యలు